బెంగళూరు: కర్ణాటక ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ తన వాదనను నిరూపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేసిన సిద్ధరామయ్య, ఆరోపణలు నిజమని రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆరోపణలు అబద్ధమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రధానికి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ కర్ణాటక ఎక్సైజ్ శాఖ నిధులను మహారాష్ట్ర, జార్ఖండ్‌తో సహా ఇతర రాష్ట్రాలకు తరలించి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కేటాయిస్తున్నారని సూచించడంతో వివాదం చెలరేగింది.
అంతకుముందు, కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ప్రత్యేకంగా మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఎక్సైజ్ లైసెన్స్‌లు, బదిలీల కోసం లంచాలు తీసుకుంటూ విస్తృతంగా అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. లైసెన్సుల కోసం రూ. 30-70 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరంలో 1,000 అక్రమ లైసెన్సులు జారీ అయ్యాయని, దీని వల్ల రూ. 300-700 కోట్ల అవినీతి జరిగిందని అసోసియేషన్ పేర్కొంది. ఈ వాదనలు నిరాధారమైనవని సిద్ధరామయ్య ఖండించారు. తన పరిపాలనలో అలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు. ఈ దేశ ప్రధాని ఇంత అబద్ధాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. ప్రధాని ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కనీసం వాస్తవానికి దగ్గరగా ఉండాలని, అయితే ఆ వాదనలు చాలా దూరంగా ఉన్నాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో, ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదన్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కర్నాటకలో మళ్లీ ప్రాబల్యం పొందేందుకు వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.