30-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఇటీవల బదిలీ వేటుకు గురైన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్ మంగళవారం చివరిరోజు విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖలో పని చేయడాన్ని ‘ఎక్స్’ వేదికగా భగవద్గీత శ్లోకమైన ‘కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన’ అని పంచుకున్నారు.
‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గానీ, ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు; అలాగని కర్మలు చేయడం మానకు’ అని దీనర్థం. టూరిజం శాఖలో నాలుగు నెలల పని చేయడం గర్వంగా, గౌరవంగా ఉందన్నారు. ఒక అధికారిగా తాను చేయగిలిగినంత చేశానని, రాష్ట్రానికి తొలిసారి 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు.
ఈ విధానం నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షిం చేందుకు బలమైన పునాదిని సృష్టిస్తుందన్నారు. పర్యాటక శాఖ పని శైలిని పునరుద్ధరించడంతో పాటు జవాబుదారీతనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్త కార్యక్రమం కోసం ఇది కచ్చితంగా మరిన్నింటికి తలుపులు తీస్తుందని పేర్కొన్నారు.
కాగా స్మితా సబర్వాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సాంస్కృతిక శాఖ నుంచి ఫైనాన్స్ కమిషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో కొందరు ఏఐతో సృష్టించిన ఫేక్ ఫోటోను రీట్వీట్ చేయడంతో పోలీసులు స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆమె రీట్వీట్ చేస్తూ.. తనలాగే 2వేల మంది రీట్వీట్ చేశారని.. వాళ్లను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారా అని స్మితా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.