calender_icon.png 24 October, 2024 | 8:53 AM

కర్మమార్గం

12-07-2024 01:00:00 AM

కళానిధి సత్యనారాయణమూర్తి

కర్మ (action) అనే సామాన్యమైన పదం వేదాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంది. కర్మవల్ల బంధం ఏర్పడి అది పునర్జన్మకి కారణమవుతుందనేది ప్రధానమైంది. ఈ కర్మ శరీరంతోనైనా చెయ్యవచ్చు (కాయిక కర్మ), మాటలతోనైనా చెయ్యవచ్చు (వాచిక కర్మ), మనస్సుతోనైనా చెయ్యవచ్చు (మానస కర్మ). ఫలాలనిచ్చే ఈ కర్మ పూర్వజన్మ నుండి ప్రాప్తిస్తే అది సంచితకర్మ, ఈ జన్మలో చేస్తున్నది, చెయ్యబోయేది ఆగామికర్మ. ‘తాను నశ్వరమైన ఈ శరీరం కంటే వేరని, నిజానికి తాను శాశ్వతమైన ఆత్మ స్వరూపుడనని’ తెలుసుకుంటే ఈ రెండు కర్మలు నశించి మోక్షం సిద్ధిస్తుంది. అనుభవంలోకి వచ్చిన కర్మ ప్రారబ్ధ కర్మ. అది పూర్తిగా అనుభవించిన తరువాతే నశిస్తుంది.

అయితే, ఈ కర్మలను భగవద్గీత సాత్త్విక, రాజసిక, తామసిక కర్మలుగా విభజించింది. శాస్త్ర విహితమైన కర్మలను నిస్సంగంగా, రాగద్వేష రహితంగా, ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే అవి ‘సాత్త్విక కర్మ’లు (గీత: 18.23), అతిగా కష్టపడుతూ, అహంకారంతో, ఏదో కోరిక తీరడం కోసం చేసేది కర్మ ‘రాజస కర్మ’ (గీత: 18.24). ఇష్టం లేకుండా, కష్ట పడవలసి వచ్చిందే అనే భావం ఉంటే కర్మ విలువ చెడిపోతుందని అర్థం. ఏ కర్మ ఆ జ్ఞానంతో కూడుకున్నదై, దానివల్ల వచ్చే కష్టనష్టాలను పర్యవసానాలను గ్రహించకుండా, తన తాహతుకు మించిందనే జ్ఞానం లేకుండా చేయడం జరుగుతుందో అది ‘తామస కర్మ’ (గీత: 18.25). ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేవి ‘కామ్య కర్మలు’. పుత్ర కామేష్టి యజ్ఞం లాంటివి. సంధ్యా వందనాదులు ‘నిత్య కర్మలు’. పితృదేవతలకు ప్రతి సంవత్సరమూ నిర్వహించేవి ‘నైమిత్తిక కర్మ’లు. అంటే ఒక కారణం ఉండి నిర్వహించే కర్మలు. శాస్త్ర విరుద్ధమైన పాప కర్మలు నిషిద్ధ కర్మలు, (కర్మ యోగం).

‘వైశేషిక దర్శనం’లో కర్మ అనే పదాన్ని వేరే విధంగా కణాదుడు వివరించాడు. ఆయన దృష్టిలో ‘కర్మ’ అంటే ‘చలనం’ (activity or movement). ‘ఏకద్రవ్య గుణం సంయోగ విభాగేష్వనపేక్ష కారణమితి’. కర్మ లక్షణం- ఒకే ద్రవ్యాన్ని ఆశ్రయించి, గుణరహితమై సంయోగ వియోగాలకు కారణభూతమైంది కర్మ (వై.సూ. 1.1.17), ఈ కర్మ మూడు విధాలుగా సంభవిస్తుంది. ప్రేరణం, (వెదురులో ఆగ్ని ప్రేరేపిస్తే ‘మండడం’ అనే కర్మ జనిస్తుంది), తాడనం (వెదురును గొడ్డలితో నరుకుట వల్ల ‘ముక్కలవడం’ అనే కర్మ జనిస్తుంది), సంయోగం (రథ చోదనంలో గుఱ్ఱాలకు, రథానికి, పగ్గాలకు ఉండే సంయోగం (connection) వల్ల ‘రథం నడవడం’ అనే కర్మ జనిస్తుంది. అయితే, కర్మ ద్రవ్యం గాని, గుణం కాని కాదు, అదొక స్వతంత్ర పదార్థం. కర్మలు ద్రవ్యానికి గుణానికి సంబంధించినవే అయినా ద్రవ్యంలోని గుణాలు శాశ్వతాలు, కర్మ క్షణికం. రాతికి బరువు శాశ్వతం. అది కింద పడడమనేది ‘క్షణికమైన కర్మ’ (movement). ‘కర్మ పంచవిధమ్. -ఉత్ క్షేపణ- -అపక్షేపణ-- అకుంచన-- ప్రసారణ గమనభేదాత్’- పైకి ఎత్తడం (upward movement), కిందికి దింపడం లేక కిందికి పడవేయడం (అపక్షేపణం downward movement), ముడుచుకొనుట (అకుంచనం -contraction), ప్రసారణం Circulation, గమనం (సాధారణ గమనం- -movement in general) అనేవి అయిదు చలనాలు. భ్రమణం (తిరగడం), స్పందనం సాధారణ గమనాలలోకే వస్తాయి. (స.ద.సం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు -పే.371). కర్మను ఇలా ‘వైశేషిక దర్శనం’లో వివరించారు.

‘నిత్య నైమిత్తిక కర్మల’ను యజ్ఞయాగాదులను చెయ్యడం ‘ఇష్టములు’ అన్నారు. తటాకాలు, సత్రాలు నిర్మించడం, వైద్యశాలలు, విద్యాసంస్థలు నిర్మించడం వంటి ప్రజోపయోగ కార్యాలు ‘పూర్తములు’. ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేసే కర్మలు ‘కామ్య కర్మలు’. ఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు ‘నిష్కామ కర్మలు’. భగవదర్పితంగా చేసే నిష్కామ కర్మవల్ల బంధం ఏర్పడదు. ‘సకామ కర్మ’వల్ల కర్మబంధం పునర్జన్మ ఏర్పడుతాయని భగవద్గీత బోధిస్తున్నది.

కర్మలను విధి, నిషిద్ధాలని రెండుగా విభజించారు. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం’ విధి. ‘దొంగతనం చెయ్యకూడదు’ అనేది నిషిద్ధం. అయితే, నిషిద్ధంలో ఉదాసీనంగా ఉండడం తప్ప కర్మ ఏముందని అడిగే పూర్వ పక్షులకు సమాధానంగా, ‘దొంగతనం చెయ్యకూడదు’ అనే నిష్ఠను పాటించడం కూడా కర్మ కిందికే వస్తుందనే చెప్పాలి.

సత్కర్త లక్షణం

కర్మను ఆచరించే వాడే కర్త. కర్మ ఫలాలు కర్తకే చెందుతాయి. వాటివల్ల పునర్జన్మ కలుగుతుంది. కనుక, కర్మ ఫలాలను ఆశించకుండా, నిస్సంగంగా భగవదర్పణ దృష్టితో చెయ్యడమే సత్కర్త లక్షణం. అందువల్ల భగవద్గీత కర్తను మూడు రకాలుగా విభజించింది. నిస్సంగంగా, ఆసక్తితో, నిరహంకారంగా ధృత్యున్నతోత్సాహంతో, ధైర్యంగా, పర్యవసానాన్ని లెక్క చేయక చేసే కర్త ‘సాత్త్విక కర్త’ (గీత: 18.26). అనురాగంతో, కర్మఫలాశతో, సంపదమీద ఆశతో, పరహింసతో, అశుచిగా, మోద క్లేశాలకు లోనై కర్మను చేసేవాడు ‘రాజస కర్త’ (గీత: 18.27). మనస్తిమితం లేకుండా, అవివేకంతో, హఠంతో, మాయావియై, ఇతరులను అవమాన పరుస్తూ, మందుడై, నిరాశతో ఆలస్యంగా కర్మను చేసేవాడు ‘తామస కర్త’ (గీత: 18.28). శుద్ధసత్య స్వరూపమైన బ్రహ్మ కర్తా కాదు, భోక్తా కాదు. కాని, శరీరగ్రస్తుడైన జీవాత్మకు మాత్రం కర్తృత్వ భోక్తృత్వ భావాలు రెండూ వుంటాయి. కనుక, జీవాత్మ కర్త, భోక్త కూడ. ఆ కారణంగా తాను చేసే కర్మలకు ప్రతిఫలం తాను అనుభవించవలసిందే. ఈ అనుభవానికే జీవాత్మకు పునర్జన్మ కలగడంగా చెప్తారు.

(‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, 

‘వేదాంత పరిభాష’ నుంచి..)