అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు?
సభ్యత్వ నమోదులో కరీంనగర్ టాప్ ఉండాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరింనగర్,(విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసిన. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన... కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.’’అని చెప్పారు.
బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు స్రుష్టించిన పార్టీ బీజేపీ. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిందన్నారు. తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉంది. అదే విధంగా సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రభాగాన ఉండాలి. అది జరగాలంటే ప్రతి పోలింగ్ బూత్ లోనూ అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేయాలి. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తా మన్నారు.