- సరళ్‌జగ్ స్వచ్ఛంద సంస్థతో సేవ
- కరీంనగర్ సహాయక్ పేరుతో యాప్
కరీంనగర్, జూలై 4 (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన వెలిచాల రాజేందర్‌రావు పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో నిర్మాణాత్మకమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడైన రాజేందర్‌రావు తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి భవిష్యత్ కార్య క్రమాలను వెల్లడించారు. తల్లిదండ్రులైన వెలిచాల సరళాదేవి, జగతిరావుల పేరుతో సరళ్ జగ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించనున్నట్లు వెల్లడించారు.
ఈ సంస్థ ద్వారా కరీంనగర్ సహాయక్ పేరుతో ఒక యాప్‌ను రూ పొందించి చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు చేరవయ్యేలా చూస్తామన్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్‌లో ప్రజా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షలతో నియోజకవర్గానికో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. మండలానికో క్రికెట్ టీంను ఏర్పాటు చేసి ఐపీఎల్ తరహాలో జిల్లాస్థాయిలో టోర్నీని నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామన్నారు.
అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని కరీంనగర్‌లో నిర్మించాలనే సంకల్పం తనకుందని, ప్రభుత్వం 50 ఎకరాల స్థలం కేటాయిస్తే ఈ స్టేడియం నిర్మాణం రూపకల్పన చేస్తామన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని రాజేందర్‌రావు తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు చేనేత యువకులతో కరీంనగర్‌లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.