calender_icon.png 25 January, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలం గూటికి కరీంనగర్ మేయర్ సునీల్!

25-01-2025 01:12:24 AM

  • పదిమంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం?
  • నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో చేరిక..
  • కరీంనగర్ బీఆర్‌ఎస్‌కు మరో షాక్

కరీంనగర్, జనవరి 24 (విజయక్రాంతి): కరీంనగర్ బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు నేడు పదిమంది కార్పొరేటర్లతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలిసింది.

గత కొద్ది రోజులుగా బండి సంజయ్‌తో సానిహిత్యంగా ఉంటున్న సునీల్‌రావు.. స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను పిలిపించడం, సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలోనూ స్మార్ట్ సిటీ నిధులు విడుదల విషయంలో బండి సంజయ్ పాత్రను సునీల్‌రావు కొనియాడారు.

అంతేకాకుండా రాష్ట్ర మంత్రులు ఉన్న వేదికపైనే సునీల్ చేరికపై చర్చ జరగడంతోపాటు కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌కు చేరిక అంశాన్ని బండి సంజయ్ వివరించినట్టు తెలిసింది. దీంతోపాటు వేదికను కాషాయమయం చేయడంతో సునీల్‌రావు చేరిక ఖాయమైపోయిందనే చర్చ మొదలయింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ హామీతో శనివారం లేదా పార్లమెంట్ సమావేశాలకు ముందు తన అనుచరులైన కార్పొరేటర్లతో సునీల్‌రావు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తున్నది.

మేయర్ పదవీకాలం మరో ఐదు రోజుల్లో ముగియనున్న క్రమంలో బీజేపీలో చేరితే బీజేపీ మేయర్‌గా ఐదు రోజులు పనిచేయనున్నారు. దీంతో ఇప్పటికే పదిమంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరగా, మేయర్ సునీల్‌తోపాటు ఆయన అనుచరులు పదిమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరితే బీఆర్‌ఎస్‌కు పెద్ద పాక్ తప్పదు. కాగా సునీల్‌రావు అంతరంగం ఎవరికి అర్థం కాదని, తాను తీసుకునే నిర్ణయాన్ని చివరి క్షణం వరకు ఎవరికీ చెప్పరని బీఆర్‌ఎస్ సీనియర్ కార్పొరేటర్ ఎడ్ల అశోక్ విజయక్రాంతితో అన్నారు.