25-04-2025 12:47:22 AM
5 లక్షల లీటర్ల పాలసేకరణకు అడుగులు
కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): కరీంనగర్ డెయిరీ వినియోగదారుల ఆదరణను చూరగొంటూ తెలంగాణకే తలమానికంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 12 వేల లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన డెయిరీ ప్రస్తుతం 2 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తూ 5 లక్షల లీటర్ల పాల సేకరణవైపు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాలకు డెయిరీ సేవలను విస్తరించింది.
ప్రస్తుతం డెయిరీలో లక్ష మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ ను ఆదర్శంగా తీసుకొని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావుతోపాటు పాలకవర్గ సభ్యులు, సిబ్బంది నిరంతర కృషి ఫలితంగా రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఎదిగింది. పాల సేకరణ, అమ్మకాలలో పురోగతి సాధిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రశ్రేణి డెయిరీగా అవతరించిన కరీంనగర్ డెయిరీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదటి దశ తర్వాత 1971 అక్టోబర్ 16న స్థాపించబడింది.
కరీంనగర్ పట్టణంలో 12 వేల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ ఏర్పాటులో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు, వ్యవసాయశాఖ మంత్రి జె చొక్కారావు కీలకపాత్ర పోషించారు. అప్పటి నుంచి ప్రజల ఆదరణ పెరుగుతుండడంతో తెలంగాణవ్యాప్తంగా డెయిరీ సేవలను విస్తరించారు. కరీంనగర్ డెయిరీ నుంచి ప్యూర్, టోన్డ్ పాలతోపాటు గోల్ఫ్ టీ స్పెషల్ పాలు కూడా లభిస్తున్నాయి.
పెరుగు ప్యాకెట్లతోపాటు బకెట్ల రూపంలో ఫంక్షన్లకు ఉపయోగపడేవిధంగా అందిస్తున్నారు. బాదం మిల్క్ వివిధ రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతుంది. బటర్ మిల్క్ తోపాటు పేడ, బానుంది, స్పెషల్ లస్సీ, జీరా బట్టర్ మిల్క్, కోవా జామూన్, పన్నీర్ తోపాటు స్వచ్ఛమైన నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రతిరోజు 1300 గ్రామాల నుంచి లక్ష పాడిరైతు కుటుంబాల నుంచి 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. ప్రతిరోజు లక్షా 20 వేల లీటర్ల పాలు, 80 వేల లీటర్ల పెరుగు అమ్మకాలు జరుపుతున్నది. తిమ్మాపూర్ మండలం నల్లగొండలో కొత్త యూనిట్ నెలకొల్పారు. ఈ యూనిట్ ద్వారా డెయిరీ పాల సేకరణ సామర్థ్యం 2 లక్షల నుంచి 5 లక్షల లీటర్లకు పెరగనుంది.
పాడి రైతుల సంక్షేమం...
పాడి, పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడి రైతులకు అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పశువుల వ్యాధి నిరోధక టీకాలకు 50 శాతం, నట్టల మాత్రలకు 75 శాతం నబ్సిడీ అందిస్తున్నారు. మేలుజాతి పశువుల అభివృద్ధికి కృత్రిమ గర్భోత్తత్తికి, ఆడదూడలు జన్మించడం కోసం 50 శాతం నబ్సిడీపై సాల్టెడ్ సెమెన్ సరఫరా చేస్తున్నారు.
బహువార్షిక పశుగ్రాసపు కణాలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అలాగే మేలు జాతి పశువుల కొనుగోలుకు రైతులకు 60 వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే 90 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. మేలురకపు పశుగ్రామ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై, మినరల్ మిక్చర్ను 25 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. 50 శాతం నబ్సిడీపై చాప్ కట్టర్లను అందజేస్తున్నారు.
పాడి పశువులు మరణిస్తే సభ్యులకు 5 నుంచి 7 వేల వరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. వాటి స్థానంలో కొత్త పశువులు కొనుగోలు చేస్తే 40 వేల వరకు రుణాన్ని అందిస్తున్నారు. పాడి భరోసా స్కీంలో భాగంగా పాల ఉత్పత్తిదారులు 200 రూపాయలు చెల్లిస్తే పాడి రైతు మరణిస్తే 50 వేల వరకు ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమ గుర్తింపు కార్డు కలిగి ఉన్న పాడి రైతు మరణిస్తే 5 వేలు, సంస్థ అధ్యక్షుడు మరణిస్తే ఏడు వేల రూపాయలను అంత్యక్రియలకు అందజేస్తున్నారు.
అలాగే పాల ఉత్పత్తిదారుల పిల్లలకు 15 శాతం స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాల శీతలీకరణ కేంద్రాల వారీగా ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న మొదటి విద్యార్ధికి 10 వేలు, రెండవ విద్యార్థికి 8 వేలు, మూడవ విద్యార్థికి 5 వేల రూపాయల పారితోషికం అందజేస్తున్నారు. కళ్యాణమస్తు పథకం ద్వారా పెళ్లి సమయంలో పుస్తె, మట్టెలు, పసుపు, కుంకుమ అందజేస్తున్నారు.
18-60 సంవత్సరాల వయస్సు కలిగిన పాడి రైతులకు వృద్ధాప్య సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద డెయిరీకి పోసే ప్రతి లీటరు పాల నుంచి 20 పైసలు చెల్లిస్తే గ్రామ సంస్థ 16 పైసలు, కరీంనగర్ డెయిరీ 20 పైసలు నిధికి జమ చేస్తారు. సభ్యుని వయస్సు 60 సంవత్సరాలు నిండగానే ఆయనకు పెన్షన్ అందజేస్తున్నారు. రైతు కోరితే జమ అయిన మొత్తం వడ్డీతో రైతు ఖాతాలో జమ చేస్తారు.
తెలంగాణ లో నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి..
కరీంనగర్ డెయిరీని తెలంగాణ రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. రోజుకు 5 లక్షల లీటర్ల పాల సేకరణ దిశగా ముందుకు వెళ్తున్నాం. నాణ్యతలో రాజీపడకుండా వినియోగదారులకు పాలు, పాల పదార్థాలు అందిస్తున్నాం. వినియోగదారుల ఆదరణ, సిబ్బంది కృషి, పాడి రైతుల సహకారంతో డెయిరీని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.
- చల్మెడ రాజేశ్వర్ రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్