పోకిరీల ఆటకట్టుకు స్పెషల్ ఫోకస్
సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
కరీంనగర్, నవంబరు 16 (విజయక్రాంతి): కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆదేశాలతో కరీంనగర్ నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. బస్టాండ్‌తోపాటు నగరంలోని పలు కూడళ్ల వద్ద భిక్షాటన చేసే వారిని, వృద్ధులను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. రాత్రి సమయంలో ఫుట్‌పాత్‌లపై సేదతీరుతున్న వారిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాలకు, వృద్ధాశ్రమాలకు తరలించే కార్యక్రమం చేపట్టారు.
వీరికి పునరావాసం కల్పించి కరీంనగర్‌ను ఫ్రీ బెగ్గింగ్ జోన్‌గా మార్చే చర్యలకు శ్రీకారంచుట్టారు. అలాగే పోకిరీలు, ఆకతాయిల ఆటకట్టే చర్యలు కూడా ప్రారంభించారు. రాత్రి సమయంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు అర్ధరాత్రి బైక్ రైడింగ్‌లు చేస్తున్న ఆకతాయిలకు అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించారు.
ఇటీవల జగిత్యాల రోడ్డులో అర్ధరాత్రివేల ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై రాష్ డ్రైవింగ్ చేస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతంలో సూర్య హాస్పిటల్ సమీపంలో రాష్ డ్రైవింగ్ చేస్తూ యువకులు మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి జులాయిలుగా తిరుగుతున్న వారిని గుర్తించారు.
ఒక్కరోజే 23 బైక్‌లు, రెండు ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. వన్‌టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్‌ఐలు రాజన్న, భాస్కర్ రెడ్డిలతోపాటు పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు.
దడ పుట్టిస్తున్న షీ టీంలు
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా షీ టీంలు పోకిరీలకు దడపుట్టిస్తున్నాయి. మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలపై దృష్టి సారించాయి. అందిన ఫిర్యాదుల ఆధారంగా సంవత్సర కాలంలో 30కిపైగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాట్సాప్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, పోలీస్ కమిషనర్ ద్వారా, పోలీస్ ఠాణాల నుండి అందిన ఫిర్యాదులను ఆధారం చేసుకొని పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులను నమోదు చేస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.