తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలివిడత ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య, హైదారాబాద్‌లో శ్రీకాంతాచారి, ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మబలిదానాలు జరిగాయి. తెలంగాణ సాధనలో కామారెడ్డి జిల్లా తన వంతు పాత్ర పోషించింది. సబ్బండ వర్ణాలు తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతున్న సమయంలో రైలుకు ఎదురెళ్లి ఇంటర్మీడియట్ చదివిన కరీం 20౧౧ సెప్టెంబర్ 20న ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అతని ప్రాణత్యాగం కామారెడ్డి ప్రాంతంలో ఉద్యమ వేడిని మరింత రగిల్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఉద్యమం మరింత ఉధృతం కావాల్సిందేనని కరీం మనుసులో తలుచుకొన్నాడు. రైలుకు ఎదురోడ్డి ప్రాణాలు పణంగా పెట్టాడు. కరీం ఆత్మహత్య ఉదంతంతో అప్పడు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్దన్ తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మ బలిదానంతో మలుపుతిప్పిన కరీంది రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద ముస్లిం కుటుంబం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్‌కల్‌కుచెందిన సయ్యద్‌ఆలీ, హైమదీ దంపతుల ఐదుగురు కుమారుల్లో కరీం చిన్నవాడు. అతికష్టం మీద ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. కరీం ఇద్దరన్నలు బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లారు. ఇంకో అన్న ఆటో నడిపేవాడు. కరీం తన మరో అన్నతో కలిసి కామారెడ్డిలో ఒక మొబైల్ షాప్ నడుపుకొనేవాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కరీం మొదటి నుంచి తెలంగాణవాదే. ఎక్కడ సమావేశాలు, ధూంధాంలు జరిగినా హాజరయ్యేవాడు. సకల జనుల సమ్మెలో చురుకుగా పాల్గొన్నాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణపై అనుసరిస్తున్నా నిర్లక్ష్య ధోరణి చూసి కలత చెందాడు. 2011 సెప్టెంబర్ 26న సకల జనుల సమ్మె 13వ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొబైల్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కరీం పాల్గొన్నాడు. తరువాత కరీం షాపుకు వెళ్లకుండా కామారెడ్డి రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న అశోక్‌నగర్ రైల్వేగేటు సమీపానికి వెళ్లాడు. అక్కడ పట్టాలపై ‘అన్నలకు జైతెలంగాణ.. అమ్మకు గుడ్ బై’ అని చాక్ పీస్‌తో రాసిండు. తరువాత వేగంగా వస్తున్న రైలుకు అడ్డుపడ్డాడు. తెలంగాణ కోసం బలిపీఠం ఎక్కాడు.
కరీం ఆత్మహత్యతో తీవ్ర ఉద్రిక్తత
కరీం ఆత్మహత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరీం ఆత్మబలిదానం విషయం తెలుసుకున్న కామారెడ్డి జేఏసీ నాయకులు జగన్నాథం, తిర్మల్‌రెడ్డి, రమేశ్‌గుప్తా, వీఎల్ నర్సింహరెడ్డి, భూంరెడ్డి, భూమేష్ యాదవ్‌తోపాటు పలువురు తెలంగాణ వాదులు రైలు పట్టాలపైకి చేరారు. పట్టాలపైనే గంటల తరబడి ధర్నా నిర్వహించారు. అటువైపు వచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ అద్దాలను ధ్వంసం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజీనామా చేయాలని.. అప్పటివరకు పట్టాలపైనుంచి కదిలేది లేదని భీష్మించారు.
పోలీసులు ఎంత నచ్చజెప్పినా పట్టు విడవకుండా పట్టాలపైనే బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీడీపీకి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని జేఏసీ నాయకులకు హమీ ఇచ్చాడు. తర్వాత రెండు రోజులకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన పదవికి, టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ప్రజల అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. కరీం అంత్యక్రియల్లో అప్పటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మరుసటి రోజు మహారాష్ట్ర గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీం కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి పరామర్శించారు.
కరీం తల్లిదండ్రుల బతుకు మారలే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసిన కరీం తల్లిదండ్రుల బతుకు స్వరాష్ట్రంలోనూ మారలేదు. నేటికి కన్‌కల్‌లోని పాత పెంకుటింటిలో ఆ కుటుంబం నివసిస్తున్నది. వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో అన్నట్టుండే ఇంట్లో బతుకువెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన మూడెకరాల స్థలం, ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం కరెంట్ బిల్లుకూడా మాఫీ కావడం లేదని లేదని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, అమర వీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన పింఛన్ రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి ,విజయక్రాంతి