సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ, నవంబర్ 27: హిమాలయాల్లో భారత్‌కు వ్యూహాత్మక ప్రాంతాలైన కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ గురించి నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అత్యంత కఠినమైన వాతావరణం ఉండే ఈ యుద్ధ క్షేత్రాల్లో పర్యాటకులకు అనుమతించాలని భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పుణె యూనివర్సిటీలో భారత్ ప్రగతిపథంలో సైన్యం పాత్ర అనే అంశంపై ద్వివేది మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని, కొంతకాలంగా సందర్శకుల తాకిడి పెరుగుతోందని ఆయన చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించామని, ఇందుకోసం సాహస యాత్రలను ఆర్మీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ సైతం ఇస్తుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని ద్వివేది పేర్కొన్నారు.