02-05-2024 12:05:00 AM
భర్త వేధింపులకు తాళలేక విడాకులు తీసుకున్న మహిళ
మేళతాళాల నడుమ కూతురిని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
న్యూఢిల్లీ, మే 1 : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ అందరి జీవితాల్లో అది నిజం కాకపోవచ్చు. పెళ్లితో మరింత అందంగా మారుతుందనుకున్న జీవితం తలకిందులైతే ఆ బాధ వర్ణించలేనిది. అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. భర్తతో గొడవలు జరుగుతున్నప్పటికీ సమా జం, బంధువులు ఏమనుకుంటారో అన్న భయంతో సర్దుకుపొమ్మని చెబుతుంటారు. కానీ ఓ మహిళ తండ్రి మాత్రం అలా ఆలోచించలేదు. తన కూతురు కష్టాన్ని చూడలేక పోయాడు. భర్తతో విడాకులు ఇప్పించాడు. అంతేకాదు విడాకుల తర్వాత మేళతాళాలతో అత్తవారింటి నుంచి వేడుకగా తీసుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. అనిల్‌కుమార్ అనే బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె ఉర్వి (36)ని 2016లో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించిం ది. పెళ్లి సమయంలో అప్పగింతలు బాగానే జరిపినప్పటికీ కొద్దికాలం తర్వాత ఆమెను భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్లు హింసను భరించిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 28న న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది.