calender_icon.png 6 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకులు బుక్కి.. కాలమెల్లదీశా!

06-11-2024 12:00:00 AM

“తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక ఆట ఆగింది, పాట మారింది. ఉపాధి కరువైంది. గ్రామాల్లో కూలీకి కూడా పిలువడంలేదు. ఉద్యమ కళాకారులను రాజకీయ నాయకులు వాడుకుని వదిలేశారు. వాళ్లకు రాజకీయ పదవులు దక్కితే మాకు యూట్యూబ్ దిక్కైంది” అంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు ఉద్యమ కళాకారుడు ముక్కపల్లి శ్రీనివాస్ అలియాస్ రెలారె శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమ సంగతులను  వివరించారు ఇలా..

ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూశా. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు అలానే ఉన్నాయి. కడపు మాడ్చుకుని మొక్కజొన్న కంకులు బుక్కి కాలం వెళ్లదీశా. అందరికీ ఉద్యమ తీరును, రాష్ట్రంలోని పరిస్థితులను తెలియజేసేందుకు నాలాంటి కళాకారులు ఊరురా తిరిగి ఆడిపాడారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేక్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.

తినడానికి తిండి కూడా ఉండేది కాదు. కడుపు మాడ్చుకుని, కుటుంబాన్ని వదులుకుని గళం వినిపించా. స్వరాష్ట్రం సిద్ధించినా ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు. ఉద్యమంతో సంబంధం లేనివారికి పదవులు, ఉద్యోగాలు దక్కాయి. గింత దారుణంగా ఉంటుందని కలలో కూడా ఊహించుకోలేదు. 

అప్పులు తీర్చలేక..

మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనంపల్లి గ్రామం. 2013లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు సర్పంచ్‌గా పోటి చేసి గెలిచా. పదవి రావడంతో తెలంగాణ సాధించాలనే పట్టుదల మరింత పెరిగింది. ఒకవైపు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూనే.. మరోవైపు నిరసనలు, వంటావార్పులు, ఆందోళన కార్యక్రమాలతో తీరిక లేకుండా పనిచేశా.

తెలంగాణ వచ్చిందేమో కానీ.. నాకు మాత్రం అల్సర్ రోగమొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్సవాలు, సంబురాల పేరుతో మరింత ఖర్చులు పెరిగాయి. పదవీకాలం తర్వాత అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చెందుకు నాయకుల చూట్టు తిరిగితే చెప్పులరిగాయి. కళాకారుడిగా ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణలో కళాకారులకు అన్యాయం జరిగిందనడానికి నేనే నిదర్శనం.

యూట్యూబే దిక్కైంది

ఉద్యోగం లేక ఏంచేయలో తెలియక ఇబ్బందులు పడుతున్నా. నా బాధను చూసి స్నేహితుడు తన యూట్యూబ్ ఛానల్‌లో పాటలు పడేందుకు అవకాశం కల్పించాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. పాటలు పాడి అందులో అప్‌లోడ్ చేయడంతో ఆర్థిక భరోసా లభించింది. ఇప్పుడు పూర్తిగా యూట్యూబే దిక్కైంది.

 సిద్దిపేట, (విజయక్రాంతి)