calender_icon.png 23 October, 2024 | 9:59 PM

క్రిప్టో పేరిట కనికట్టు!

02-09-2024 03:03:46 AM

  • నిర్మల్ జిల్లాలో రూ. 50 కోట్లకు పైగా వ్యాపారం
  • అమాయక ప్రజలను మోసంచేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులు అరెస్టు
  • అరెస్టయినవారిలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే

నిర్మల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఘరానా మోసం.. జిల్లా కేంద్రంతో పాటు కడెం, ఖానాపూర్ మండలాల్లో క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఆదివారం నిర్మల్‌లోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

గత ఆరు నెలల నుంచి నిర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ పేరుతో ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహి స్తున్నారన్న సమా చారంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అమాయక ప్రజలు, పేద.. మధ్య తరగ తి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి నిర్మల్ జిల్లాలో రూ. 50 కోట్లకు పైగా వ్యాపారం నిర్వహించారని తెలిపారు. కడెం మండలం నవాబుపేటకు చెందిన సల్ల రాజ్‌కుమార్ ప్రధాన సూత్రధారిగా సాయికిరణ్, కండెల నరేష్, గంగాధర్, మహేష్ అనే ఐదుగురు ముఠాగా ఏర్పడి బిట్‌కాయిన్ వ్యాపారం ప్రారంభించారు.

సాయి రాజ్‌కుమార్, సాయి కిరణ్ ఇద్దరు సేహితులు. రాజ్‌కుమార్ పదవీ విరమణ చేసిన ఆర్మీ ఉద్యోగి కాగా సాయికిరన్  కడెం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపా దించాలనే ఉద్యేశంలో ఈ వ్యాపారానికి తెరలేపారు. ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న ఎస్సై నిర్మల్‌కు చెందిన గంగాధర్, కడెం మండలంలోని గంగాపూర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కండల నరేష్, నిర్మల్ పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్న మహేష్‌తో చేతు లు కలిపి ఈ వ్యాపారం విస్తరించినట్టు ఎస్పీ వివరిం చారు. ఐదుగురు సభ్యులు ఉన్న ముఠాలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులే.

అందులో ఇద్దరు టీచర్లు కాగా ఒకరు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐ, మరొకరు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌లుగా విధులు నిర్వహిస్తు న్నారు. తమకు తెలిసిన వారితో పరిచయాలు పెంచుకొని క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టించారని విచారణలో తేలిందన్నారు. ఒక సారి లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు రూ.15వేల ఆదాయం వస్తుందని నమ్మబలికిన వారు మొద ట కొందరికి నగదును నెలసరి చెల్లించి, చైన్ సిస్టంలో సభ్యు లుగా మరికొందరిని చేర్పిస్తే ఆ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పడంతో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

అయితే ఇది ఆన్‌లైన్ మోసం కావడడంతో దీనికి ఎటువంటి పూచీకత్తు లేకపోవడంతో పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకొని వారం రోజులుగా భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించడం జరిగిందన్నారు. పెట్టుబడిపెట్టిన వారితో మాట్లాడి ఈ వ్యాపారంపై పోలీసు శాఖ చర్యలు తీసుకుందని, సల్ల రాజ్‌కుమార్ స్థాపించిన మెటా మాస్క్ ఖాతాపై విచారణ జరిపామన్నారు. అయితే ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను శనివారం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నా రన్నారు.

వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. ఆన్‌లైన్ మోసాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని, అమాయక ప్రజలను ఎవరు మోసం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడ్డట్టయితే తమ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది, కృష్ణ, రవి, రవీందర్ పాల్గొన్నారు.