కొచ్చి,(విజయక్రాంతి): ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన కంగువ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన నిషాద్(43) కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. నిషాద్ తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున విగత జీవిగా కనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి, అతని అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. నిషాద్ ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి ఎడిటర్ గా పనిచేశాడు. 2022లో విడుదలైన 'తల్లుమాల' సినిమాకు గాను అతని ఉత్తమ ఎడిటర్ గా గుర్తించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందించింది. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న'బాజూకా' సినిమాకు నిషాద్ పనిచేస్తున్నారు. నిషాద్ యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అకాల మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.