calender_icon.png 31 October, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగారూలకు గర్వభంగం!

26-06-2024 01:01:35 AM

పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే నాలుగు జట్లేవి అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘మొదటిది ఆస్ట్రేలియా.. మిగిలిన మూడింటి గురించి నేను ఆలోచించను.. అవి ఏవైనా మాకు పెద్దగా సంబంధం లేదు’ అని బదులిచ్చాడు. నిరుడు భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు.. అహ్మదాబాద్ స్టేడియంలో లక్ష మంది భారత అభిమానులను నిశబ్దంలో ముంచెత్తడం కంటే గొప్ప ఫీలింగ్ ఏముంటుంది అని చెప్పి.. తుదిపోరులో దాన్ని అక్షరాల చేసి చూపించిన కమిన్స్.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం అదే దూకుడు కనబర్చలేకపోయాడు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సూపర్ చేరిన ఆస్ట్రేలియా.. అక్కడ అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన కంగరూలు.. ఆ తర్వాత వరసగా అఫ్గానిస్థాన్, భారత్ చేతిలో పరాజయం పాలై సెమీస్ చేరకుండానే ఇంటిబాటపట్టారు. ఐసీసీ టోర్నీల్లో భారత అభిమానులకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆస్ట్రేలియా.. ఈసారి సెమీస్‌కు చేరలేదనే విషయమే ఆ దేశస్థులకు మింగుడుపడటం లేదు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ప్రపంచ శ్రేణి ప్లేయర్లు ఉన్న ఆస్ట్రేలియా సూపర్ నుంచి వైదొలుగుతుందని.. 

ఎవరూ ఊహించి ఉండరు. 

అయితే ఇందులో కంగరూల పేలవ ఫీల్డింగ్‌తో పాటు.. ప్రత్యర్థుల కసి కూడా ఉందనేది వాస్తవం. అఫ్గానిస్థాన్‌తో పోరునే తీసుకుంటే.. నిరుడు వన్డే ప్రపంచకప్‌లోనూ కంగారూలను ఓడించినంత పనిచేసిన కాబూలీలు.. ఈసారి పట్టు వదల్లేదు. చక్కటి బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు.. మునుపెన్నడూ చూడని ఫీల్డింగ్‌తో ఆకట్టుకొని ఆసీస్ ఆట కట్టించారు. ఇక చావోరేవో లాంటి పోరులో టీమిండియాపై మార్ష్ సేన కడవరకు కొట్లాడింది. నిరుడు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమిని మనసులో ముద్రించుకున్న రోహిత్ సేన సూపర్ చివరి పోరులో కంగరూలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ శివాలెత్తినట్లు రెచ్చిపోగా.. బౌలర్లు సమష్టికృషితో కంగారూలకు కళ్లెం వేశారు. 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ కూడా నెగ్గి ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్ అనిపించుకోవాలని కలలుగన్నా.. వాటిని అఫ్గాన్ మంటలో కలిపింది. ముందే ఊహించినట్లు ఈ మెగాటోర్నీతో వార్నర్ కెరీర్‌కు వీడ్కోలు పలకగా.. ఆసీస్ జట్టులోనూ త్వరలో మార్పులు చూడనుండటం ఖాయమే!

 -ఖేల్ విభాగం