చంఢీగఢ్: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సొంతంగా తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'ఎమర్జెన్సీ'తో ఆమె మళ్లీ వివాదాలకు కేంద్రబిందువయ్యారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కంగనా రనౌత్ న్యాయ సంబంధిత చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. చండీగఢ్ లోని ఓ జిల్లా కోర్టు కంగనకు నోటీసులు జారీ చేసింది. జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది రవీందర్ సింగ్ బస్సి ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు.
'ఎమర్జెన్సీ' సినిమాలో సిక్కుల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం కంగన చేసిందని తన పిటిషన్ లో రవీందర్ సింగ్ ఆరోపించారు. సిక్కులను కించపరిచేలా చూపించడమే కాకుండా, సిక్కు సామాజికవర్గంపై పలు అసత్య ఆరోపణలు చేశారని... ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కంగనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి కంగన దర్శకత్వం వహించారు. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ కూడా విడుదలయింది. కాగా ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.