calender_icon.png 25 November, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక కేంద్రంగా కందకూర్తి

11-11-2024 01:53:11 AM

డిచ్‌పల్లిలో దత్తాత్రేయను సన్మానిస్తున్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణ

  1. కేంద్ర సహాయం కోరుతా 
  2. నదులను కలుషితం కానియ్యొద్దు
  3. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 10 (విజయక్రాంతి): త్రివేణి సంగమం అయిన కందకూర్తిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని, అందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని త్రివేణిసంగమం కందకూర్తిని ఆయన సందర్శించారు.

కార్తీకమాసం సందర్భంగా త్రివేణిసంగమంలో స్నానాలు ఆచరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య నది హారతిని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావ్ బాలిరాం హెగ్డెవార్ జన్మించిన కందకూర్తి త్రివేణిసంగమాన్ని సందర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతమని దత్తాత్రేయ అన్నారు. కార్తీకమాసంలో నదులలో కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించడం, వనభోజనాలు నిర్వహించడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న హిందువుల సంస్కృతి అన్నారు. నదులు ఏ విధంగాను కలుషితం కాకుండా చూసే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు.

భూమి, నీరు, గాలి, చెట్టు, భూమాతను పూజించి ధన్యులం కావాలన్నారు. తాను హర్యానా గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డనేనన్నారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో దత్తాత్రేయకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణగుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులకర్ణి దినేష్‌చారి, జిల్లా మాజీ  అధ్యక్షుడు లోక భూపతిరెడ్డి సన్మానించారు.