calender_icon.png 2 October, 2024 | 3:55 AM

కబ్జా కోరల్లో కంచరోడి చెరువు

02-10-2024 12:57:18 AM

14 ఏళ్లలో 11 ఎకరాలు ఆక్రమణ

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు

ఆక్రమణ భూముల విలువ రూ.50కోట్లు

నిర్మల్,  అక్టోబర్ 1(విజయక్రాంతి): నిర్మ ల్ పట్టణంలో గొలుసుకట్టు చెరువులకు స్వాగతం పలికే కంచరోడి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకున్నది. నిర్మలనాయుడు నిర్మించి న ఈ చెరువుపై కన్నేసిన కొందరు శిఖం భూములతో పాటు బఫర్ జోన్‌లలో భూములు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు.

కొందరు శిఖం భూములను పాట్లుగా మార్చి విక్రయించారు. ఇందులో బడా నేతలు, రియల్  వ్యాపారులు ఉండటంతో ఎన్నో ఫిర్యాదులు వచ్చినా అధికా రులు నామమాత్రపు సర్వేలు నిర్వహించి ఆక్రమణలు లేవని నివేదికలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

చెరువు విస్తీర్ణం 76,33 ఎకరాలు కాగా 11.10 ఎకారాలు అక్రమార్కుల చెరలో ఉన్నదని అధికారులు గుర్తిం చారు. జాతీయ రహదారికి ఆనుకుని చెరువు ఉండటంతో భూముల విలువ పెరిగింది. దీంతో 14 ఏళ్లలో 11.10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు ఇటీవలే నీటి పారుదల శాఖ నిర్వహించిన డిజిటల్ శాటిలైట్ సర్వేలో ఉప గ్రహాల చిత్రాల ద్వారా తెలిసింది.

భూమి విలువ రూ.50 కోట్లకు పైగానే

కంచరోడి చెరువు శిఖం బఫర్ జోన్ భూముల ఆక్రమణల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుంది. నిర్మల్ పట్టణం జిల్లా కేం ద్రం అయిన తరువాత వేగంగా అభివృద్ధి చెందింది. నిర్మల్ పట్టణ వ్యాపార వాణిజ్య, విద్యా వరునుల కేంద్రం కావడంతో భూములకు విపరీతమైన డింమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఒక్కో ప్లాట్ విలువ రూ.40 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి శిఖం భూములను ఆక్రమించుకున్నారు.

2010లో చెరువు విస్తీర్ణం 76 ఎకరాలు ఉండగా ఇప్పుడు 66 ఎకరాలకు పడిపోయింది. అంతకుముందు రికార్డుల్లో ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆక్రమించుకున్న వారిలో చాలామంది సమీపంలోగల పట్టా భూములను తీసుకుని సరిహద్దులు చెరిపివేసి చెరువు భూములను కబ్జా చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదులపై చర్యలు శూన్యం

కంచరోడికట్ట ఆక్రమణలపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో జాయింట్ యాక్షన్ సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మూడుసార్లు సరిహద్దుల వెంబడి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసినా అవి ఇప్పుడు కనిపించడం లేదు.

ఎఫ్‌టీఎల్‌కు ఆనుకొని పది మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో కూడా కట్టడాలు నిషేధం ఉన్నప్పటికీ అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే చెరువులో వందలాది ఇండ్లు నిర్మించడంతో చెరువు కుదించుకుపోయింది. చెరువు కింద ఆయకట్టు లేక భూములు ప్లాట్లుగా మారడంతో నీరు చెరువులో ఉంటే ఇండ్లలోకి వస్తుందని భావించి తూములను ధ్వంసం చేసి నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.