calender_icon.png 11 January, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి దిశ దశ మారుస్తా

06-12-2024 08:33:44 PM

సీఎంతో చర్చించి 27 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించా

స్టేడియం అధునీకరణకు 8 కోట్లు

ఎవరు అడ్డుపడ్డ కామరెడ్డి అభివృద్ధి ఆగదు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీమంత్రి షబ్బీర్ అలీ...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ దశ దిశ మారుస్తానని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డిలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియం అధునీకరణ పనుల కోసం అదనంగా 8 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కామారెడ్డి స్టేడియం ఉండేలా తీర్చిదిద్దుతానన్నారు. స్టేడియం అన్ని అంగులతో జాతీయస్థాయి క్రీడలు కొనసాగేలా చేయడం తన అభిమతమని అన్నారు. తన కలను సాకారం చేస్తానని తెలిపారు.

కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం టియుఎఫ్ఐడిసి నిధులు 12 కోట్లు, ప్రత్యేకంగా 3.5 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి కొరకు 4.50 కోట్లు ఎంజిఎన్ఆర్ఆర్ నిధులు ద్వారా సిసి రోడ్ల నిర్మాణం నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. తాను మాటలతో అభివృద్ధి చేయనని చేతలతోనే చేసి చూపెడతానాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఇంకో 50 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బిజెపి నాయకులు మాటలు చెప్తారు గానీ పనులు చేయరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్ని ఇచ్చాడు అని ప్రశ్నించారు. ఇతర దేశాలలో బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు నల్లధనాన్ని వేస్తానని చెప్పి ఎన్ని ఏళ్ళు అవుతుందో ప్రజలు గ్రహించాలన్నారు.

చెప్పడమే తప్ప చేయడం బిజెపికి ఉండదన్నారు. దేశాన్ని దోపిడి చేసి పారిపోయిన ఎగవేత దారులను దేశానికి తిరిగి తెప్పిస్తానని ఎంతమందిని తీసుకొచ్చావు అని మోడీని ప్రశ్నించారు. దేశాన్ని దోచి ఆదాని అంబానీలకు పెడుతున్నావు తప్ప దేశంలోని పేద ప్రజలకు పట్టించుకోవడం లేదన్నారు. ప్రపంచం మొత్తం ఆదాని డిఫాల్ట్ అంటుంటే నీవు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఈరోజు రైతులకు రుణమాఫీ కాలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎంత చేశారు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దెబ్బ రెండు లక్షల రుణమాఫీ చేసి ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తామని మిగతా వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు.

సంక్రాంతికి రైతు భరోసా కూడా అందజేస్తామన్నారు, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను సాంక్షన్ చేసిందన్నారు, రాష్ట్రం మొత్తం 25 లక్షల నిరుపేదలకు ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు. దానికోసం 12,500 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు దానికోసం ప్రత్యేకమైన యాప్ను విడుదల చేసి దాంట్లోనే అందరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఆరు గ్యారంటీలో అన్ని అమలు చేశామన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. ప్రగల్బాలు పలికే చరిత్ర కాంగ్రెస్కు లేదని అన్నారు. కామారెడ్డి దశ దిశ మార్చడమే తన ధ్యేయమని షబ్బీర్ అలీ అన్నారు.

కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, దోమకొండ శ్రీనివాస్, పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, ఐరేని సందీప్, మామిండ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.