calender_icon.png 26 March, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు విక్రయాన్ని అడ్డుకున్న కామారెడ్డి పెట్రోలింగ్ బ్లూ కార్ట్ పోలీసులు

25-03-2025 07:46:28 PM

పోలీసులను అభినందించిన ఎస్పీ...

కామారెడ్డి (విజయక్రాంతి): నవ మాసాలు మోసి పుట్టిన బిడ్డను డబ్బుల కోసం కర్కషత్వంతో అమ్ముకునేందుకు చూసిన తల్లిదండ్రులను వారి నుంచి పసిబిడ్డను కొనుగోలు చేసిన వారిని, మధ్యవర్తులను కామారెడ్డి వీక్లీ మార్కెట్ వద్ద పోలీసులు పట్టుకొని కటకటాల పాలు చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన మగ బిడ్డను అమ్మకానికి పెట్టారు. బేరం కుదిరింది డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అసలు విషయం మంగళవారం బయటపడింది.

పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లూ కార్డ్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వాగ్వాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చంటి బాబును తల్లిదండ్రులు అమ్ముకోగా కొనుగోలు చేసిన వ్యక్తుల మధ్య మధ్యవర్తులకు అమ్మకం చేసిన తల్లిదండ్రుల మధ్య డబ్బుల పంపకం విషయంలో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులు తమ ఉన్నతాదికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో పసి బాలుని విక్రయం గుట్టు బయటపడింది. వెంటనే పోలీసులు విక్రయించిన బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక అమ్మాల్సి వచ్చిందని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చంటి బిడ్డని మార్కెట్లో అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులను మందలించారు.

ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగిన పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి వీక్లీ మార్కెట్లో గొడవ పడుతున్నారని సమాచారం పెట్రోలింగ్ బ్లూ కోర్టు పోలీస్ సిబ్బందికి సమాచారం రాగానే వెంటనే స్పందించడంతో బాలుని విక్రయాన్ని అడ్డుకున్నారు. బాధ్యులను గుర్తించి వారిని మంగళవారం వారిని పోలీసులు కటకటాలకు పంపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ రాజీవ్ చంద్ర తెలుసుకొని సంబంధిత పెట్రోలింగ్ బ్లూ కార్ట్ పోలీసులు ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుల్ వెంకటేష్, పోలీస్ సిబ్బందిని అభినందించారు. పెట్రోలింగ్ బ్లూ కార్ట్ సిబ్బంది తక్షణమే స్పందించడం వల్ల బాలుని విక్రయాన్ని అడ్డుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.