25-04-2025 10:05:36 PM
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీంలను సంప్రదించాలని, మహిళలకు రక్షణలో కామారెడ్డి షీ టీం ముందుంటుందనీ జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి జిల్లాలోని విద్యార్థినులు, మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న షీ టీం సభ్యులు సౌజన్య, ప్రవీణలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర స్వయంగా అభినందించారు. పాఠశాలలు, కాలేజీల్లో "గుడ్ టచ్-బ్యాడ్ టచ్" లాంటి కీలక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందించినందుకు ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు ప్రదానం చేశారు.
షీ టీం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కొత్త చట్టాలపై సమాచారం ఇవ్వడమే కాక, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తున్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ, నిబంధనల ప్రకారం సున్నితంగా పరిష్కారాలు కనుగొంటున్నారు. జిల్లా ప్రజలకు షీ టీం అందుబాటులో ఉండే నంబర్: 8712686094 "మీ రక్షణ మా బాధ్యత" అన్న నినాదంతో, కామారెడ్డి షీ టీం విద్యార్థినులు, మహిళా భద్రత కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. విద్యార్థినులు, మహిళలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిని రక్షించడమే కాక, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి భరోసా తెలిపారు.