- భక్తుల కోలాహలంతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
- హాజరైన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్
ముషీరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఐదో రోజు కోటి దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ స్టేడియమంతా భక్తుల కోలాహలం, శివనామ స్మరణతో మార్మోగింది. వేద వ్యాస పాఠశాల హైదరాబాద్ ఆధ్వర్యంలో వేదపఠనం చేశారు.
భక్తీ టీవి అధినేత దంపతుల నేతృత్వంలో ప్రాంగణంలో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం వైభవంగా నిర్వహించారు. డాక్టర్ అనంత లక్ష్మీ ప్రవచనం చేశారు. మహాశివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి ప్రదోష వ్రత అభిషేకం చేశారు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి అభిషేకం చేశారు. మల్దకల్ వేంకటేశ్వరస్వామికి స్నపనతిరుమంజనం, కోటి తులసి అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.
అవని శృంగేరి జగద్గురు మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ అద్వైతనందభారతి స్వామి ఆధ్వర్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతిని నిర్వహించారు. అనంతరం తులసి దామోదర కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఊరేగించారు. కోటి దీపోత్సవానికి ఈశాన్య ప్రాంత విద్యాభివృద్ధి కేంద్ర సహాయ మంత్రి, గోల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.