calender_icon.png 6 October, 2024 | 10:01 AM

కమలాహారిస్ తడబాటు

06-10-2024 01:52:38 AM

టెలీ ప్రాంప్టర్ పనిచేయక ఇబ్బందులు

‘32 రోజులు’ అంటూ ఆగిన అమెరికా ఉపాధ్యక్షురాలు

న్యూయార్క్, అక్టోబర్ 5: డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ తన ఎన్నికల ప్రచారంలో తడబడ్డారు. ‘32 రోజుల అనే పదాన్ని ఆమె పదేపదే ఉచ్చరించారు. అయితే సభలో ఏర్పా టు చేసిన టెలీప్రాంటర్ ఆగిపోవడంతోనే ఏం మాట్లాడాలో తెలియక ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. మిచిగాన్‌లో జరిగిన ప్రచార సభలో కమలాహారిస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 వేల మందికిపైగా మద్దతుదారులు హాజరయ్యారు. ఎన్నికలకు 32 రోజులు మాత్రమే సమయం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో టెలీ ప్రాంప్టర్ ఆగిపోవడంతో ‘32 రోజులు’ అనే పదాన్ని పదేపదే వ్యాఖ్యానించి..

‘ఈ రేసు కష్టమైనప్పటికీ మనమే విజయం సాధిస్తాం’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన తో ఉపాధ్యక్షురాలు బహిరంగ ప్రదర్శనల్లో టెలీ ప్రాంప్టర్‌పై ఆధారపడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అమెరికాకు చెందిన వ్యాఖ్యత ఓప్రా విన్‌ఫ్రేతో జరిగిన ఇంటర్వ్యూలోనూ కమలాహారిస్ సెట్‌లో టెలీప్రాంప్టర్‌ను వాడారంటూ హారిస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.