calender_icon.png 24 September, 2024 | 6:02 AM

కమల వర్సెస్ ట్రంప్

21-09-2024 02:44:15 AM

అధ్యక్ష రేసులో గెలుపెవరిది?

డిబేట్ తర్వాత మారిన చిత్రం

కమలకు అనుకూలంగా సర్వేల ఫలితాలు

విరాళాలూ రికార్డు స్థాయిలో అందుతున్నాయి

ట్రంప్‌కు తగ్గిపోతున్న మద్దతు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అమెరికా అధ్యక్ష బరిలోకి డెమోక్రాట్ల తరఫున కమలా హ్యారిస్ లెక్కలు తారుమారయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థిగా ఉన్నంత కాలం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించారు. పోల్ సర్వేలు కూడా ట్రంప్‌కే ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు చెప్పాయి. అనూహ్యంగా బైడెన్ రేసు నుంచి వైదొలగడంతో కమలకు అవకాశం లభించింది.

కమల రాకతో డెమోక్రాట్లలో ఉత్సాహం రెట్టింపు అయింది. విరాళాలు కూడా భారీగా అందాయి. అన్నింటికీ మించి సెప్టెంబర్ 10న జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్‌పై కమలాహ్యారిస్ పూర్తి ఆధిపత్యం సాధించడంతో ఆమెకు మరింత మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న సర్వేలు సైతం కమలకు అనుకూలంగా వస్తున్నాయి. గతంలో బైడెన్‌తో జరిగిన డిబేట్‌లో ట్రంప్ ఆధిపత్యం సాధించగా.. ఆయన గెలుపు ఖాయమనే అందరూ భావించారు. కానీ, కమల అభ్యర్థిగా వచ్చిన తర్వాత పూర్తి చిత్రం మారిపోయింది. 

డిబేట్ ప్రామాణికం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య టీవీ డిబేట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంవాదంలో పైచేయి సాధించినవారే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చాలా సార్లు ఇలాగే జరిగింది. అందుకే అమెరికా ఎన్నికలు వస్తే అందరూ డిబేట్ కోసమే ఉత్కంఠగా ఎదురుచూస్తారు. తాజాగా ఈ నెల రెండోవారంలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తర్వాత నిర్వహించిన సర్వేల్లో ట్రంప్‌పై కమల ఆధిపత్యం ప్రదర్శించారు.

ట్రంప్ కూడా భారీగా మద్దతు కోల్పోయినట్లు చెబుతున్నాయి. ఐపీసాస్ సర్వే ప్రకారం సెప్టెంబర్ 10కి ముందు ట్రంప్‌కు 46 శాతం మద్దతు ఉండగా సెప్టెంబర్ 11 తర్వాత 42 శాతానికి పడిపోయింది. గతంతో పోలిస్తే ట్రంప్‌కు మద్దతు పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య స్వల్ప తేడానే చూపిస్తున్నాయి. 

కమలదే ఆధిపత్యం

అమెరికాలో ప్రస్తుత ఎన్నికల ప్రచారాన్ని రెండు పార్టీలు హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. ట్రంప్, కమల విస్తృత పర్యటిస్తూ విరాళాలను సేకరిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నం జరగడం గమనార్హం. ఇది ట్రంప్‌కు సానుభూతి కల్పిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. అయినా అధ్యక్ష ఎన్నికల్లో డిబేట్‌లో ఆధిపత్యం సాధించిన కమలకే అధిక అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏబీసీ వార్తా సంస్థ నిర్వహించిన కమల, ట్రంప్ డిబేట్‌ను 6.7 కోట్ల మంది వీక్షించారు. జూన్‌లో జరిగిన ట్రంప్, బైడెన్ సంవాదాన్ని 5.1 కోట్ల మంది వీక్షించడం గమనార్హం. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 

యూఎస్ ఒపీనియన్ పోల్స్

సర్వే సంస్థ సెప్టెంబర్ 1-10 సెప్టెంబర్ 11-19

హ్యారిస్ ట్రంప్ హ్యారిస్ ట్రంప్

ఐపీసాస్ 52% 46% 47% 42%

ఎకనామిస్ట్/యూగొవ్ 47% 45% 49% 45%

రియల్‌క్లియర్ పాలిటిక్స్ 48.1% 46.7% 49.3% 47.3%

ఫైవ్‌థర్టీఎయిట్ 48.1% 45.5% 48.5% 45.2%

సిల్వర్ బులెటిన్ 48.7% 44.7% 49.1% 46%