18-04-2025 01:28:40 AM
వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో చర్చలు
ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వరుసగా కేంద్రం లో మూడోసారి అధికారంలోకి వచ్చిన కమ లం పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి వేటలో తలమునకలైంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడి వేటలో స్పీడ్ పెంచిన బీజేపీకి ఈ నెల చివరికల్లా కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కీలకనేతలతో బీజేపీ వరుసపెట్టి సమావేశాలు జరుపుతోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి రాష్ట్ర శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ, మరికొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే పనిలో నిమగ్నమైంది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులను నియమించేందుకు బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు.
14 రాష్ట్రాల్లో పూర్తి..
బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కనీసం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి ఉండాలి. కమలం పార్టీ ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసింది. రాజ్యాంగం ప్రకారం ఇంకా ఐదు రాష్ట్రాల్లో పూర్తి చేస్తే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. మిగతా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు కూడా త్వరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఒకసారి ఈ తతంగం పూర్తవగానే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని బీజేపీ యోచిస్తోంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో చర్చలు ప్రారంభించారు.
ఈ ఎన్నిక ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ వారంలో నిర్వహించతలపెట్టిన క్యాబినెట్ భేటీ కూడా ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో లేదని స్పష్టం చేశారు.