అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిపై ఇంతవరకు నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొనడం ఖాయమైంది. పోటీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేశానని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని హారిస్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో తెలిపారు. పార్టీలోని అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల బరినుంచి తప్పు కొంటున్నట్లు ఆ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో ఆయన కమలా హారిస్‌ను తన నామినీగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతోపాటు డెమోక్రాటిక్ పార్టీలోని పలువురు నేతలు మద్దతు ప్రకటించారు. కమల హారిస్ పేరును బైడెన్ ప్రకటించాక అమెరికాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అప్పటి వరకు తిరుగులేని అధిక్యతతతో దూసుకుపోతున్న ట్రంప్ ఇప్పుడు వెనకబడిపోయారు. తాజా సర్వేలో ట్రంప్‌కన్నా కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 19 నుంచి మూడు రోజులు జరిగే డెమోక్రటిక్ పార్టీ సదస్సులో పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరును అధికారకంగా ప్రకటించడం లాంఛనమేనని అంటున్నారు.
జో బైడెన్ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా ప్రజలు అయిష్టంగానే ట్రంప్‌వైపు మొగ్గాల్సిన పరిస్థితిలో ఇన్నాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారికి కమలా హారిస్ కొత్త ఆశాకిరణంగా మారారు. గత ఎనిమిదేళ్ల కాలంలో డెమోక్రటిక్ పార్టీనుంచి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. 2016లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ పోటీ చేసి ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు. ట్రంప్‌పై కమల పోటీకి దిగడం విశేషం.
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గనుక విజయం సాధిస్తే శ్వేతసౌధంలో అడుగుపెడుతున్న భారతీయ మూలాలున్న మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. కమల హారిస్ పూర్తి పేరు కమలాదేవి హారిస్. ఆమె తల్లి శ్యామలా గోపాలన్. చెన్నైకి చెందిన ఆమె పై చదువుల కోసం అమెరికా వెళ్లి శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. తండ్రి డొనాల్డ్ హారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. తల్లి భారతీయురాలు కాబట్టి, కమల భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. తనకు భారత్ అంటేనే ఎక్కువ ఇష్టమని కమల తరచూ చెబుతుంటారు. చిన్నప్పుడు చెన్నై బీచ్‌లో తాతగారితో గడిపిన క్షణాలను అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటారు. తల్లే తన రియల్ హీరో అని సగర్వంగా చెప్పుకొంటారు.
హోవార్డ్ యూనివర్సిటీనుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేసిన కమల కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్ కాలేజి ఆఫ్ లానుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకున్నారు. హోవార్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలుగా పోటీ చేసిన ఆమె 2017లో కాలిఫోర్నియా సెనేటర్‌గా విజయం సాధించి కరోల్ మోస్తే తర్వాత ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన తొలి నల్లజాతీయురాలిగా అరుదైన ఘనతను అందుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురి పెట్టారు.
ఆమె ఒక ఫెయిల్యూర్ అని, ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే అతివాద అధ్యక్షురాలుగా చరిత్రలో నిలిచి పోతారంటూ ట్రంప్ విమర్శించినా, పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రించబోతున్నారంటూ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యానించినా అవేవీ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచలేవు. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించడం ఖాయమన్న భావన అమెరికాలో రోజురోజుకు బలపడుతున్నది.