calender_icon.png 10 January, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌పై కమల పైచేయి?

12-09-2024 12:00:00 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఇంతకుముందు  డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీకి సిద్ధమయిన జో బైడెన్‌తో జరిగిన డిబేట్‌లో పైచేయి సాధించిన నేపథ్యంలో తాజాగా కమల, ట్రంప్ డిబేట్‌పై అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి. ఇరువురి మధ్య పోటీ నువ్యా, నేనా అన్నట్లుగా ఉందని వార్తలు రావడం కూడా ఇందుకు మరో కారణం. అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్‌లో ఈ డిబేట్‌ను నిర్వహించింది.

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో మొదలైన ఈ డిబేట్ దాదాపు గంటన్నర పాటు సాగింది. ఈ డిబేట్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భ విచ్ఛిత్తి అంశం. ఇజ్రాయెల్‌హమాస్ యుద్ధం, ఉక్రెయిన్‌పై రష్యా దాడితో పాటుగా వలసలు వంటి ఇతర అంశాలపైనా వాడీ వేడిచర్చ జరిగింది. డిబేట్‌లో యాంకర్లు దేశ ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయంగురించి ఎలాంటి ప్రణాళికలున్నాయో చెప్పాల్సిందిగా ముందుగా హారిస్‌ను ప్రశ్నించారు. తాను మధ్యతరతి కుటుంబంనుంచి వచ్చానని,అధ్యక్షురాలిగా తనను గెలిపిస్తే మధ్య తరగతి, పేద వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హారిస్ చెప్పారు.

‘తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా అర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని బైడెన్, నేను సరి చేశాం’ అని హారిస్ చెప్పారు. అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికయితే అమెరికాకు చిక్కులు తప్పవంటూ హెచ్చరించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. కరోనా సమయంలో కూడా తాను దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచానని చెప్పుకొచ్చారు. జో బైడెన్ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా హారిస్ అడ్డు తగిలి ట్రంప్ ఏమీ మారలేదని, అవే అబద్ధాలు, అవే మోసాలు వల్లెవేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు.

కాగా ఇటీవల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భ విచ్ఛిత్తి అంశంపైనా ఇరువురి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. అమెరికాలో గర్భ విచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ వస్తే గర్భ విచ్ఛిత్తిపై నిషేధం విధించాలనుకుంటున్నారని ఇది మహిళలను అవమానించడమేనని అన్నారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయంలో తన వైఖరిని హారిస్ స్పష్టంగా చెప్పారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేస్తూనే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నామన్నారు.

ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో మొదలుకొని ఇతర యూరప్‌పై దృష్టిసారిస్తూ ఉండేవారన్నారు. రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించాలని మీరు కోరుకుంటున్నారా అని యాంకర్లు ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. కానీ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నానని మాత్రం అన్నారు. వీటితో పాటుగా అమెరికాలో పెరిగిపోతున్న అక్రమ వలసలు వంటి ఇతర ప్రధాన అంశాలపైన కూడా చర్చ జరిగింది.

అయితే ట్రంప్‌తో తొలిసారి జరిగిన ఈ డిబేట్‌లో కమలా హారిస్ స్పష్టంగా పైచేయి సాధించారని అమెరికా మీడియా పేర్కొనడం గమనార్హం. కమలా హారిస్‌లో దృఢవిశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు పేర్కొన్నాయి. ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్‌గా తనకున్న అనుభవన్ని కమల  చక్కగా ఉపయోగించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ డిబేట్ కమలకు మరింత నైతిక బలాన్ని అందించిందనే చెప్పాలి.