అధ్యక్ష ఎన్నికల్లో జోరు
డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కు నెట్టిన ఉపాధ్యక్షురాలు
రాయిటర్స్ పోల్ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్, జూలై 24: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రోజురోజుకూ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం, డెమోక్రాటిక్ అభ్యర్థి బరి నుంచి అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యంగా తప్పుకోవటంతో పోరు రసవత్తరంగా మారింది. బైడెన్ వారసురాలిగా బరిలోకి వచ్చిన ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు ఇంకా అధికారికంగా పార్టీ అభ్యర్థిగా అవకాశం దక్కలేదు. హత్యాయత్నం తర్వాత ట్రంప్‌కు భారీగా ప్రజాదర ణ పెరిగిందని, ఈ పరిస్థితుల్లో ఆయనను కమలా ఓడించలేదని సొంతపార్టీలోనే కొం దరు అడ్డుపుల్లలు వేస్తున్నారు.
తాజాగా ఈ వాదనను పూర్వపక్షం చేసే సర్వే ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం సాగుతున్న ప్రచారంలో ట్రంప్‌కంటే కమలనే ముందున్నారని రాయిటర్స్ ఇప్సోస్ పోల్ సర్వేలో తేలింది. ఇందులో కమలకు ౪౪ పాయింట్లు రాగా, ట్రంప్‌కు ౪౨ పాయింట్లు వచ్చినట్టు రాయిటర్స్ ప్రకటించింది. ఇద్దరి మధ్య తేడా స్వల్పంగా ఉండటంతో నవంబర్ నాటికి ప్రజలు ఎటు మొగ్గుతారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. మరోవైపు డెమోక్రాట్లు కమలకే జై కొడతారా? లేదంటే మరో అభ్యర్థిని పోటీకి తీసుకొస్తారా? అన్నదానిపై కూడా ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.