- ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
- ట్రంప్‌తో మస్క్ ఇంటర్వ్యూకు భారీ స్పందన
- ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన 20 కోట్ల మంది
- ఈ నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 13: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేయడం ఆస క్తికరంగా మారింది. అయితే, మస్క్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్‌ను కూడా ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ‘కమల ఇంటర్వ్యూ కు కూడా హోస్ట్‌గా ఉండడం ఆనందంగా ఉంది’ అంటూ ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కొన్ని వారాలుగా ఆమె ఎటువంటి ఇంటర్వ్యూలకు హాజరుకాకపోవడంతో మస్క్ ఆహ్వానాన్ని ఒప్పుకుంటారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మస్క్ పోస్ట్‌పై కమల నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే, సోమవారం ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ చేయడంపై కమల బృందం స్పందించింది. ‘ఏదేమైనా దీనివల్ల ట్రంప్ అతివాద, ప్రమాదకరమైన ఆలోచనలు తెలిశాయి. మధ్య తరగతి ప్రజల జీవితాలను అమ్మకానికి పెట్టే మస్క్ వంటి బిలియనీర్ల అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మస్క్ అమెరికా ప్రజాస్వామ్యాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని’ కమల బృందం ఆరోపించింది.
పుతిన్, జిన్‌పింగ్, కిమ్ తమ దేశాలను ప్రేమిస్తారు: ట్రంప్
ఎలాన్ మస్క్ చేసిన ఇంటర్వ్యూలో ట్రం ప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డెమోక్రాట్లపై విమర్శల దగ్గరి నుంచి అమెరికా ప్రత్యర్థి దేశాలపై పొగడ్తల వరకు ఇంటర్వ్యూ సాగింది. ఇటీవల బైడెన్‌తో తాను చేసిన డిబెట్ తన గొప్ప చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. డిబెట్‌లో బైడెన్‌ను ఘోరంగా ఓడించానని, ఫలితంగా ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు. వారి పార్టీలో తిరుగుబాటు కారణంగానే బైడెన్ వైదొలగాల్సి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. అదే విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ఉన్ తమ తమ ఆట ల్లో టాప్‌లో ఉన్నారని, వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని, యూఎస్ అధ్యక్షుడిగా బైడెన్ లేకపోయి ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేదే కాదని అభిప్రాయ పడ్డారు. పుతిన్‌తో తాను చాలాసార్లు మాట్లాడానని, ఆయన తనకు చాలా గౌరవమిస్తారని, ఉక్రెయిన్ గురించి కూడా తాము చాలా చర్చించుకున్నామని ట్రంప్ చెప్పారు. కాగా, ఇంటర్వ్యూలో కమలా హ్యారిస్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘ప్రస్తుతం మనకు అధ్యక్షుడు ఉన్నా లేనట్లేనని, కమల వస్తే మరింత దారుణంగా ఉంటుందని, 60 మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారన్నారు.
20 కోట్ల మందికి పైగా వీక్షణ
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రం ప్.. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఇంట ర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిపై మస్క్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్ ఇంటర్వ్యూను 20 కోట్ల మందికి పైగా వీక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మీడి యాను ఆయన తప్పుబట్టారు. వారు ట్రంప్ సంభాషణను పట్టించుకోలేదని, కానీ అది ఇప్పుడు 20 కోట్ల వీక్షణలను దాటేసే దశలో ఉందని పేర్కొన్నారు. ట్రంప్ ఇంటర్వ్యూ సమయంలో సామాజిక మాధ్యమంపై సైబర్ దాడి జరిగిం దని ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించా రు. తమ మాధ్యమంపై భారీగా డీడీవోఎస్ దాడి జరిగిందని పోస్టు చేశారు. దీని ద్వారా సర్వర్ లేదా నెట్‌వర్క్‌పై దాడి చేశారని, దీంతో ఈ కార్యక్రమం వీక్షించే వారి సంఖ్య బాగా తగ్గిందన్నారు.