calender_icon.png 23 September, 2024 | 12:42 AM

కమలదే పైచేయి

12-09-2024 02:47:33 AM

  1. అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో హ్యారిస్ దూకుడు 
  2. అన్ని అంశాల్లో ట్రంప్‌ను నిలువరించిన హ్యారిస్ 
  3. సన్నద్ధతతో విరుచుకుపడిన డెమోక్రాట్ అభ్యర్థి 
  4. హ్యారిస్‌కు 63 శాతం, ట్రంప్‌కు 37 శాతం మద్దతు 
  5. చైనాకు అమెరికాను అమ్మేశారని ట్రంప్‌పై కమల ఆరోపణ 
  6. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ డిబేట్: ట్రంప్

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల సంవాదంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది. గతంలో బైడెన్, ట్రంప్ డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయిగా భావించిన అమెరికా మీడియా.. తాజా డిబేట్‌లో మాత్రం కమలా హ్యారిస్ ఆధిపత్యం చూపించినట్లు చెబుతోంది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్‌లో హ్యారిస్‌లో దృఢ విశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. డిబేట్‌ను నిర్వహించిన ఏబీసీ మీడియా సైతం ఇరువురి వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై పూర్తి కథనాన్ని ప్రచురించింది.

డిబేట్‌లో హ్యారిస్‌కు 63 శాతం, ట్రంప్‌కు 37 శాతం మద్దతు లభించింది. చాలా సంస్థలు కమలకే మద్దతు తెలిపాయి. ఏబీసీ మీడియా కూడా కమల పైచేయి సాధించినట్లు పరోక్షంగా వెల్లడించింది. కమలపై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదలు చేసినట్లు పేర్కొంది. ట్రంప్ విమర్శలకు దీటుగా కమల సమయం వృథా కానివ్వకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు వెల్లడించింది. 

పూర్తి సన్నద్ధతతో.. 

కమల లాయర్‌గా పనిచేసిన తన పూర్తి అనుభవవాన్ని డిబేట్‌లో ప్రదర్శించారని చాలామంది చెబుతున్నారు. పొలిటికో, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌ఎన్ తదితర మీడియా సంస్థలన్నీ కమలకే మద్దతు పలికాయి. ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్‌గా తనకున్న అనుభవాన్ని కమలా హ్యారిస్ ఉపయోగించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హ్యారిస్‌ను ఎదుర్కోకుండా తనను తాను కాపాడునే ప్రయత్నంలో ట్రంప్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని, 2020 ఎన్నికల నాటి వాదననే మళ్లీ తెరమీదకు తెచ్చారని పేర్కొంది. కమల పూర్తి సన్నద్ధతతో వచ్చారని, ఆమె చెప్పే ప్రతి సమాధానం ట్రంప్‌కు కోపం తెచ్చేలా ఉందని సీఎన్‌ఎన్ పేర్కొంది. కొన్నిసార్లు ఆయన సహనం కోల్పోయినట్లు కనిపించినట్లు స్పష్టం చేసింది. కాగా, డిబేట్‌లో అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. 

కీలకాంశాలపై చర్చ

అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్చిత్తి, ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు ఉక్రెయిన్ సమస్యలపై చర్చ జరిగింది. ఈ అంశాలపై ఇరువురి మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ కమల పైచేయి సాధిం చారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన మొదట్లో ట్రంప్ దూకుడు ప్రదర్శించారు.

బైడెన్‌తో సంవాదంలో పైచేయి సాధించారు. కానీ హ్యారిస్ రాకతో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే కమలా హ్యారిస్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. తాజా డిబేట్‌లోనూ కమలా హ్యారిస్ సత్తా చాటడంతో డెమోక్రాట్లలో మరింత ఉత్సాహం కనిపిస్తున్నట్లు సమాచారం. 

చైనాకు అమెరికాను అమ్మేశారు

డిబేట్‌లో న్యూస్ యాంకర్లు పేదరికంపై ప్రశ్నించగా.. కమల స్పందిస్తూ తనకు అధ్యక్షురాలిగా అవకాశం లభిస్తే పేదరికాన్ని నిర్మూలి ంచేందుకు చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తానని చెప్పారు. వారికి అండగా నిలిచేందుకు తన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పేదలకు అండగా ఉంటామని ఎన్నోసార్లు చెప్పి నా.. ట్రంప్ మాత్రం ధనికులు, కార్పొరేట్లకు మద్దతుగా ఉన్నారని కమల ఆరోపించారు.

కార్పొరేట్లకు ట్యాక్స్ కూడా తగ్గించేందుకు ట్రంప్ వెనకాడరనిచెప్పారు. అంతేకాకు ండా దేశాన్ని సమస్యల్లో వదిలేసి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని ట్రంప్‌పై కమల తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి దేశాన్ని చైనాకు అమ్మేశారని మండిపడ్డారు. బైడెన్ ఈ పరిస్థితిని చక్కది ద్దారని, మళ్లీ ట్రంప్ వస్తే చిక్కులు తప్పవనారు. 

బెస్ట్ డిబేట్

కమలతో డిబేట్‌పై స్పందించిన ట్రంప్.. తాను ఎదుర్కొన్న అత్యుత్తమ సంవాదమని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదే సమయంలో డిబేట్ నిర్వహి ంచిన ఏబీసీ నెట్‌వర్క్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా సంస్థ పనిచేస్తోందని మండిపడ్డారు. కమలకు మద్దతుగా నిలిచిన పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పైనా ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇందుకు భవిష్యత్తులో ఆమె తప్పకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్, కమల షేక్‌హ్యాండ్‌తో ప్రారంభమైన డిబేట్.. పరస్పర విమర్శల దాడితో కొనసాగింది.

బైడెన్‌ను హ్యారిస్ వ్యతిరేకిస్తారని, ఆయన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని ట్రంప్ ఆరోపణలు చేయగా.. కమల అంతే దీటుగా బదులిచ్చారు. తాను ట్రంప్, బైడెన్‌కు భిన్నంగా దేశానికి కొత్తతరం నాయక త్వాన్ని అందిస్తానని జవాబిచ్చారు. కాగా, డిబేట్‌లో బైడెన్‌పై ట్రంప్ వరుసగా ఆరోపణలు చేయడంపై స్పందిస్తూ.. అధ్యక్ష అభ్యర్తి గా తాను పోటీ చేస్తున్నట్లు గుర్తు చేస్తూ మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులో ముగిసేదని ట్రంప్ ప్రకటనపై స్పందిస్తూ.. యుద్ధం పై ట్రంప్ చేతులెత్తేసేవారని, కీవ్‌లో పుతిన్ కూర్చునేవారని ఆరోపించారు.

చెవి పోగులేనా? 

డిబేట్ సందర్భంగా కమల హ్యారిస్ ధరించిన ముత్యాల చెవిపోగులపై వివాదం మొదలైంది. ఆమె పెట్టుకున్నవి చెవిపోగులు కావని, ఆడియో ఇయర్ పీసులని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సంవాదంలో ట్రంప్‌కు దీటుగా సమాధానం ఇచ్చేందుకు ఈ ఇయర్ రింగ్స్ ధరించారని, సందర్భాన్ని బట్టి ఆమె అనుచరులు వీటి ద్వారా సూచనలు అందించారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వీటి సాయంతోనే డిబేట్‌లో ట్రంప్‌పై కమల పైచేయి సాధించారని చెబుతున్నారు.