calender_icon.png 26 October, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుడి వేటలో కళ్యాణి ఓరుగంటి!

24-10-2024 12:35:59 AM

‘పేరు.. కళ్యాణి ఓరుగంటి. హోమ్ టౌన్.. వరంగల్. వయసు.. 23. లుకింగ్ ఫర్.. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, వెజిటేరియన్’ ఇవన్నీ చూస్తుంటే, పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఓ అమ్మాయి అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది కదూ! ఈ కాబోయే వధువును ఎక్కడో చూసినట్టు కూడా ఉందనిపిస్తోంది కదూ.

ఔను, మీరనుకున్నట్టు.. హీరోయిన్ చాందినీ చౌదరినే!! త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుందా, ఏంటీ? అనుకుంటున్నారా?! అదేం కాదు. చాందినీ చౌదరి నటిస్తున్న తాజా సినిమా తాలూకు పాత్ర వివరాలివి. విక్రాంత్, చాందినీ చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’.

ఈ చిత్రాన్ని మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం హీరోయిన్ చాందినీ చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా కావాలని, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వద్దని ఆమె కోరుకుంటున్నట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాలో చాందిని కళ్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆ సమస్యను ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటోంది. వెన్నెల కిషోర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమఠం, మురళీధర్‌గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్‌కుమార్, తాగుబోతు రమేశ్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా, కిరీటి, సద్దామ్, తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్;  డీవోపీ: మాహి రెడ్డి పండుగుల; మాటలు: కళ్యాణ్ రాఘవ్.