బెల్లంపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆయన 216 మంది లబ్ధిదారులకు రూ. రెండు కోట్ల 5 లక్షల 56 వేల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. రూ.5 వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తుందని చెప్పారు. వచ్చే సంక్రాంతి తర్వాత మరొక ప్రత్యేకమైన పథకాన్ని కూడా మహిళలకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ పథకంలో ఇళ్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు ఏ ప్రభుత్వము పేదలకు ఇళ్లను మంజూరు చేయలేదన్నారు. 2004-2009 లో తాను మంత్రిగా పనిచేసిన కాలంలో లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ళను మొదటగా తానే మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వచ్చే అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సంక్రాంతి పండుగ తర్వాత సర్వే నివేదిక ఆధారంగా అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లను అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసిల్దార్లు జ్యోత్స్న, రమేష్, ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుకూరి రామ్ చందర్, పట్టణ పార్టీ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్యతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.