- ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం
- సంక్షేమ పథకాలలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు
- ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ
- 91 మంది లబ్దిదారులకు రూ.91లక్షలు పంపిణీ
చేగుంట, జనవరి 18ః ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, చేగుంట తహసిల్దార్, సంబంధిత ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరంగా భావించాలని, ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తుంది అంటే అది మంచి పథకంగా భావించాలని అన్నారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాలను తర్వాతి ప్రభుత్వాలు కూడా అమలు చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ చెక్కులను ఇస్తుందన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాలుగు పథకాలు 26 నుండి అమలు అవుతాయని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామగ్రామాన అధికారులు తిరుగుతున్నారని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
రైతు భరోసా సంవత్సరానికి 12 వేల రూపాయలు రెండు విడతలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవారికి కళ్యాణ లక్ష్మి గొప్ప వరం అన్నారు. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇప్పటి ప్రభుత్వం కూడా దాని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.2.16 కోట్లతో నిర్మించిన 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్నిప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, ట్రాన్స్కో ఎస్.ఈ శంకర్, ఏ.డి.ఈ శృతి, సంబంధిత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులుపాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో ప్రొటోకాల్ రగడ
వడియారంలో ఏర్పాటు చేసిన మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రొటోకాల్ రగడ నెలకొంది. మంత్రి పాల్గొనే వేదికపై దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి కూర్చోవడంతో దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సహకారంతో నిధులు తీసుకువస్తుంటే ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం, నినాదాలు మారుమ్రోగాయి. ఒకదశలో తోపులాట జరగడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.