14-04-2025 10:23:10 PM
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కొడుకు పాత్రలో కల్యాణ్‌రామ్ నటిస్తుండగా.. ఆయన తల్లిగా విజయశాంతి కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆలోచన ఎలా వచ్చింది.. కల్యాణ్‌రామ్‌ను ఎలా సంప్రదించారు?
-కల్యాణ్‌రామ్‌తో సినిమా చేయాలని తొలుత నిర్మాతలు అనుకున్నారు. అప్పటికే ఆయన డెవిల్ అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఉన్నారు. ముందుగా మాస్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. మాస్ జోనర్‌లో హీరో క్యారెక్టర్‌ను తయారుచేశాను. తర్వాత ఒక శక్తిమంతమైన తల్లి పాత్ర అనుకున్నాం. ఆ మదర్ వైజయంతి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనిపించింది. ఈ విషయాన్ని ముందుగా హీరోకు చెప్పాం.. ఆయన.. ‘చేద్దాం కానీ, విజయశాంతి ఒప్పుకుంటేనే చేద్దాం..’ అని స్పష్టంగా చెప్పేశారు. విజయశాంతికి కథ చెప్పాం. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సెట్స్ మీద తీసుకువెళ్లాం.
ఇందులో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏమిటి?
హీరో క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ ఎవరి ఐడియాలజీలో వాళ్లు కరెక్ట్‌గా ఉంటారు. అక్కడ్నుంచే కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండూ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. విజయశాంతి ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా చేశారు. కథ విన్నప్పుడే తాను పోరాట సన్నివేశాలకు సిద్ధమని చెప్పారామె.
‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా తర్వాత మీరింత గ్యాప్ తీసుకోవడానికి కారణం?
కథలు ఓకే అయ్యాయి. ఒక పెద్ద హీరో సినిమాకు అడ్వాన్సులు ఇచ్చి కూడా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగాం. అలాగే యూవీ క్రియేషన్‌లో ఒక కథ కోసం మూడేళ్లు పాటు కూర్చున్నాం. అది త్వరలో చేయబోతున్నాం. ఇంకా అనిల్ సుంకర బ్యానర్‌లో ఏడాదిన్నరపాటు ఒక కథ మీద పనిచేశాను. అవి ఎప్పుడు ప్రారంభమైనా పెద్ద సినిమాలవుతాయి.
ఈ సినిమా క్ల్లుమాక్స్ గురించి గొప్పగా చెబుతున్నారు.. ఎలా ఉండబోతుంది?
-మదర్ కోసం ఎంత త్యాగం చేయ్యొచ్చో ప్రేక్షకులు చూస్తారు. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
కల్యాణ్ అన్న కాలర్ ఎగరేస్తాడని ఎన్టీఆర్ చెప్పారు.. ఆ నమ్మకం ఎలా వచ్చింది?
-ఎన్టీఆర్ సినిమా చూశారు. ఆ తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ అది.
సయీ మంజ్రేకర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఎమోషనల్ యాక్షన్ ఫిలిం ఇది. అలాంటి సీరియస్ ఫిలింలో కాస్త కూల్ బ్రీజా ఉండే పాత్ర తనది. ఆమె క్యారెక్టర్‌కు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఎలా డిజైన్ చేశారు?
-విజయశాంతి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ పృథ్వీ మాస్టర్ చేశారు. రామకృష్ణ మాస్టారు ఇంటర్వెల్, క్ల్లుమాక్స్ రెండు ఫైట్లు చేశారు. పీటర్ మాస్టర్ హీరో ఇంట్రడక్షన్ క్లుమైక్స్ ఫైట్ చేశారు. విలన్ సీక్వెన్స్ రెండు రఘువరణ్ మాస్టర్ చేశారు. ఫైట్లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి.
విజయశాంతి కథను ఒప్పుకున్న తర్వాత కచ్చితంగా మీ మీద ఒక బాధ్యత, అదే సమయంలో భయం కూడా ఉంటుంది కదా?!
-భయమేమీ లేదండి. కాన్ఫిడెంట్‌గా చెప్పాం. కాన్ఫిడెన్స్‌గా చేశాం. నిజానికి విజయశాంతిని నేనే ఇబ్బందిపెట్టాను. ఇందులో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్లో విజయశాంతి ఓ రెండు గంటల పాటు అడవిలోని బురదలో అలాగే ఉండిపోయారు. షాట్ పూర్తయ్యేవరకు అలాగే బురదలో పడుకున్నారు. ఆ సీన్ ఫినిష్ చేసి కార్వాన్‌లోకి వెళ్లిన తర్వాత మేడమ్‌కు తీవ్రమైన జ్వరం వచ్చింది. చేయి వణుకుతుంది. అయినప్పటికీ ఆ సీన్ అయ్యేవరకు అక్కడ నుంచి కదల్లేదు. అంతా డెడికేటెడ్‌గా పనిచేశారు. మేడం సీనియార్టీ ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఆవిడ నటన చూసిన తర్వాత చాలాసార్లు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. మరోస్థాయిలో పెర్ఫార్మన్స్ చేశారామె. కల్యాణ్‌రామ్, విజయశాంతి పోటీపడి నటించారు.
ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉంది?
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. ఎక్కడ వెనకడుగు వేయలేదు. అన్ని విధాలా సపోర్ట్ చేశారు.
అజినీష్ మ్యూజిక్ గురించి..?
-రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కల్యాణ్‌రామ్‌కి, విజయశాంతికి, విలన్‌కి ప్రతి క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ సౌండ్ ట్రాక్‌ని క్రియేట్ చేశారు.
కల్యాణ్‌రామ్ స్ట్రెంత్ ఏంటి?
-ఆయన బలం ఎమోషన్. ఎమోషన్‌నున అదరగొట్టేస్తారు.
ఈ కథలో మెయిన్ ఎమోషన్ ఏమిటి?
-తల్లితండ్రులు మన బర్త్‌డేని ఒక సెలబ్రేషన్స్‌లా చేస్తారు. తల్లిదండ్రుల బర్త్‌డేని మనం సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను.
కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమా నుంచి ఎలాంటి అంశాలను ఆశించొచ్చు?
-అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా ఇది. అదే అభిమానులు ఆశించవచ్చు.
మీ బలం ఏమిటి?
-ఎమోషన్ నా బలం. నేను తర్వాత చేయబోయే సినిమాలు కూడా భావోద్వేగ ప్రధానంగానే ఉంటాయి.