calender_icon.png 18 October, 2024 | 3:28 AM

కల్వకుర్తిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

18-10-2024 12:52:29 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు (రంగారెడ్డి), అక్టోబర్ 17 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

గురువారం ఆమనగల్లులోని ఓ గార్డెన్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆమనగల్లు సభలో ప్రకటించిన ఏ ఒక్క హామీని నెరవేర్చనందుకే నియోజకవర్గ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఐదేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేశారే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కల్వకుర్తి ప్రాంత బిడ్డ కావడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సీఎంను కలిసి నిధుల గురించి విన్నవిస్తే రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.204 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.

తాను గతంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో బీటీ, సీసీ రోడ్ల కోసం దాదాపుగా రూ.160 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 2016లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు రూ.178 కోట్లు మంజూరు చేయించడంతో పాటుగా తాను వ్యక్తిగతంగా కొంత నిధులను వెచ్చించి నియోజకవర్గంలోని జంగారెడ్డిపల్లి వరకు కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకే అహర్నిశలు శ్రమించినట్లు చెప్పారు.

అక్కడి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు దాదాపుగా 59 కిలోమీటర్ల వరకు కాల్వ పనులు పూర్తికాకపోవడంతో పాటు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించడంలో గత ప్రభుత్వం పూర్తిగా జాప్యం చేసిందని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు కేసీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు.

ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రైతులకు పెండింగ్ భూ పరిహారం కింద రూ.7.60 కోట్లు వెంటనే చెల్లించడంతో ప్రస్తుతం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి, సింగంపల్లి వరకు సాగునీరు పారుతోందని, వారం రోజుల్లో నాగిళ్ల వరకు సాగునీరు వస్తుందని తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాలకు  పాలమూరుెేరంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో స్థల ఏర్పాటు జాప్యం కారణంగానే  సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేయలేకపోయానని, త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని పేర్కొన్నారు.

నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల దవాఖాన, ఆమనగల్లు మండల కేంద్రంలో స్కిల్ సెంటర్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల నూతన భవనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు జగన్, బిక్యానాయక్, డోకూరు ప్రభాకర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.