calender_icon.png 22 October, 2024 | 7:08 AM

కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం

22-10-2024 03:28:01 AM

  1. గత ప్రభుత్వంలో అభివృద్ధి  జరగలేదు, అందుకే పార్టీ మారా
  2. ఏడాదిలోపే నియోజకవర్గానికి రూ.300 కోట్ల నిధులు తెచ్చా
  3. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి

ఆమనగల్లు (రంగారెడ్డి) అక్టోబర్21(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడంతోనే తాను బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టం చేశారు.

సోమవారం కడ్తాల, ఆమనగల్లు మండలాల్లో 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తహసీల్దార్లు ముంతాజ్, లలిత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి రూ.300 కోట్ల నిధులు తీసుకొచ్చిన ట్లు చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్  తాను పార్టీ మారడంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని గతంలో ఆయన టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో మారలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి నియోజకవర్గానికి 4,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు.

ఆమనగల్లులో స్కిల్ సెంటర్, తలకొండపల్లి మండల కేంద్రంలో సమీకృతగురుకులాల ఏర్పాటుకు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లో అన్నీ మండలాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని, వారంలోనే నాగిళ్ల వద్ద కృష్ణా జలాలకు రైతులతో కలిసి పూజలు చేయనున్నట్లు చెప్పారు. పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్‌లో చెక్కుల పంపిణీ..

ముషీరాబాద్, అక్టోబర్ 21: (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని రాంనగర్‌కు చెందిన 11 మంది లబ్ధిదారులకు.. రూ. 3లక్షల 98వేల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదలు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ధరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిదులు మంజూరి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాంగనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్‌చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు.. ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి, జ్ఞానేశ్వర్ గౌడ్, గోక నవీన్, బల్వీర్ కుమార్, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.