వర్చువల్‌గా విచారణకు హాజరు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మరోసారి కోర్టు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ చార్జ్‌షీట్‌పై విచారణ నిర్వహించింది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన కవిత ఈ విచారణకు హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు.
ఆమెతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా కూడా విచారణకు హాజరయ్యారు. సీబీఐ చార్జిషీట్‌లో స్పష్టత లేని పత్రాలను సరిచేసి అందించాలని ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ప్రతివాదులు అడిగిన పత్రాలు అందజేయాలని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశించారు. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.