calender_icon.png 23 September, 2024 | 11:59 AM

అయోధ్య రాముడికి కల్తీ లడ్డు?

22-09-2024 12:09:49 AM

బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు లక్ష తిరుపతి లడ్డూలు

వాటిలో కల్తీ జరిగిందేమోనన్న ఆలయ పూజారి

తిరుపతికి మేం నెయ్యి అమ్మలేదు: అమూల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూలను కల్తీ నెయ్యి తో తయారుచేశారన్న వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తమవుతున్నది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరగా.. కల్తీపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ కూడా లడ్డూ కల్తీపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో అత్యంత అట్టహాసంగా జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమలో తిరుపతి లడ్డూలను సరఫరా చేయటమే అందుకు కారణం. ‘ఎన్ని లడ్డూలు కొన్నారో నాకు సరిగా తెలియదు. ఆ విషయం ట్రస్ట్‌కు తెలుసు. వచ్చిన లడ్డూలను ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ఆ లడ్డూల్లో కల్తీ జరిగటం మాత్రం ప్రమాదకరమైన కుట్రే’ అని దాస్ పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీటీడీ లక్ష లడ్డూలను పంపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మాత్రం భిన్నంగా స్పందించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు భక్తులకు యాలకులు మాత్రమే ప్రసాదంగా అందించినట్లు ట్రంస్ కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు. 

కల్తీపై అనుమానాలు

తమినాళడుకు చెందిన ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించటంతో వివాదం మొదలైంది. నెయ్యి కొనుగోలుకు టీటీడీ జారీచేసి న టెండర్‌లో కల్తీ నిరోధానికి కఠిన నిబంధనలున్నాయి. క్లాజ్ 80 ప్రకారం నెయ్యి నాణ్యతపై సప్లు చేసే సంస్థ కచ్చితంగా ఎన్‌ఏబీఎల్ లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన ల్యాబోరేటరీల నుంచి నాణ్యత ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. క్లాజ్ 81 ప్రకారం నెయ్యి నమూనాలను టీటీడీ తప్పనిసరిగా నాణ్యత పరీక్షలకు పంపాల్సి ఉంటుంది. 

టీటీడీకి మేం అమ్మలేదు: అమూల్

నెయ్యి కల్తీ వివాదంతో తమకు ఏ సంబంధం లేదని ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ ప్రకటించింది. టీటీడీపీ తాము నెయ్యి అమ్మలేదని శనివారం ప్రకటించింది. అమూల్ కూడా టీటీడీకి నెయ్యి విక్రయించిందని కొందరు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. తమపై తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. 

అన్ని గుళ్లకు నందిని నెయ్యే: కర్ణాటక ప్రభుత్వం

టీటీడీలో నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పరిధిలో ఉన్న 34 వేల ఆలయాల్లో నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశాలు జారీచేసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)దే ఈ నందిని బ్రాండ్.