calender_icon.png 18 November, 2024 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరంలో కల్తీ దందా

18-11-2024 12:00:00 AM

  1. బ్రాండెడ్ పేర్లతో నాసిరకం వస్తువుల తయారీ
  2. వరుసగా దాడులు నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్  
  3. వారం వ్యవధిలో 12 మంది అరెస్ట్ 
  4. శిక్షలు కఠినతరం చేయాలని ప్రజల డిమాండ్

కట్లకుంట విజయ్‌కుమార్ :

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): కల్తీకి కాదేది అనార్హమన్నట్లు భాగ్యనగరంలో చిన్న పిల్లలు తాగే పాలను మొదలుకొని వృద్ధులు వాడే మందుల వరకు ప్రతీ దాన్ని కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

బ్రాండెడ్ పేర్లతో నాసిరకం, కల్తీ వస్తువులను తయారుచేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. గడిచిన వారం రోజుల్లోనే భాగ్యనగరంలో మూడు వేర్వేరు ఘటనల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

పచ్చని పల్లెలు.. కల్తీ లేని ఆహార పదార్థాలు..

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు.. పచ్చని పల్లెలు.. కల్తీ లేని ఆహార పదార్థాలు. అప్పటి ఆహారం తిన్న పూర్వీకులు వం దేళ్లు ఆరోగ్యంగా బతికేవారు. కానీ ప్రస్తుతం కల్తీ ఆహార ర్థాల పుణ్యమా అని చిన్నవయసులో నే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది 60 ఏండ్ల లోపు మరణిస్తున్నారు.

ఉద యం నిద్ర లేవగానే టీ కోసం పాల ప్యాకెట్, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్, కర్రీస్, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంలో ఉపయోగించే ప్రతిదీ కల్తీ మయమైంది. తక్కువ ధర కు వస్తుందని కొందరు.. బ్రాండెడ్ పేర్లతో మరికొందరు వారికి తెలియకుండానే కల్తీ, నాసికరం వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అనారో గ్యాల బారినపడి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

ప్రతీది బయట కోనాల్సిందే

అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతున్న భాగ్యనగరంలో సుమారు కోటికి పైగా జనాభా ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగుల జీవితం. ప్రస్తుత కాలంలో భార్యభర్తలుద్దరూ ఉద్యోగం చేస్తేనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు. ఇలా రకరకాల కారణాలతో ప్రజలు బయట లభించే వస్తువులపై ఆధారపడాల్సి వస్తోం ది. దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు ప్రబుద్ధులు విచ్చలవిడిగా కల్తీ పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. తద్వారా మనిషి జీవితకాలం తగ్గిపోతూ వస్తుంది. 

వారం రోజుల్లో పట్టుబడ్డ కల్తీగాళ్లు

* ఆదివారం సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరీ నగర్‌లో ‘సోని గోల్డ్’ అనే పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.4.5 లక్షల విలువైన 1,500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

* శనివారం చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్‌లోని వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించి బ్రాండెడ్ పేరుతో లోకల్ వాటర్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.3.6 లక్షల విలువైన 28,608 వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

* గతవారం అఫ్జల్‌గంజ్ పీఎస్ పరిధిలోని ఉస్మాన్‌గంజ్‌లో సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి కల్తీ కారం పొడిని తయారుచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 35 కిలోల కల్తీకారం పొడితో పాటు అందుకోసం వాడే సరుకులను స్వాధీనం చేసుకున్నారు.