calender_icon.png 17 October, 2024 | 9:48 AM

జార్ఖండ్‌లో కల్పన గాలి

17-10-2024 01:35:21 AM

  1. రాజకీయాల్లో దూసుకుపోతున్న సొరెన్ కోడలు
  2. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి తనదైన ముద్ర
  3. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన.. అద్భుత వాగ్ధాటి
  4. మహిళల్లో కల్పనపై వేగంగా పెరుగుతున్న అభిమానం

రాంచీ, అక్టోబర్ 16: జార్ఖండ్‌లో ప్రస్తుతం జరుగుతున్న అసెం బ్లీ ఎన్నికలు అధికార ఇండియా కూటమికి, ప్రతిపక్ష ఎన్డీయేకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రెండు వర్గాల్లోనూ ప్రధాన నాయకులంతా పురుషులే ఉన్నారు. వారి మధ్యలో ధైర్యంగా, దీటుగా నిలబడ్డారు కల్పన సొరేన్.

ఆమె వాగ్ధాటికి జార్ఖండ్‌లోని పట్టణ ప్రాంతంతోపాటు గ్రామీణ మహిళలు కూడా ముగ్ధులవుతున్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన కల్పన ఇంగ్లిష్, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, ఆమె ఈ ఏడాది జనవరి వరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె భర్తను మనీ లాండరింగ్ కేసులో ఈడీ జనవరిలో అరెస్టు చేయటంతో ఆమె ఇల్లు విడిచి ప్రజల్లోకి వచ్చారు.

నిజానికి హేమంత్ సొరేన్ స్థానంలో కల్పన సీఎం అవుతారని అనుకొన్నారు. కానీ, చంపై సొరేన్ సీఎం అయ్యారు. అయినా ఆమె పదవులు ఆశించకుండా పార్టీని కాపాడుకోవటమే లక్ష్యంగా ముందుకు కదిలారు.

హేమంత్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె మొదటిసారి తెరపైకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండియా కూటమిని గెలిపించే బాధ్యతను స్వీకరించి రాష్ట్రంలోని ఐదు ఎస్టీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకొన్నారు.  

సుడిగాలి పర్యటనలు

ప్రస్తుతం హేమంత్ సొరేన్ తన పార్టీ బాధ్యతలు మొత్తం భార్యకు అప్పగించి ప్రభుత్వ పనులు చూసుకొంటున్నారు. కల్పన ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. రెండుమూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన నిర్వహించి ఏకంగా 70 సభల్లో మాట్లాడారు. ముఖ్యంగా మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు పవిక్షానికి నిద్ర పట్టనివ్వటం లేదు.

వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. దీంతో ఆమె వారిని తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధిస్తున్నారు. పేద మహిళలకు ఆర్థికసాయం అందించేందుకు చేపట్టిన మయ్యన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో కల్పన అద్భుత కృషి చేస్తున్నారు.

దీంతో ఇంతకాలం హేమంత్ సొరేన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ కొడతాయో అని భయపడిన జేఎంఎం వర్గాలు.. ఇప్పుడు కల్పన ప్రచారంతో వాటన్నింటినీ అధిగమించవచ్చని నమ్ముతున్నది.