- వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
- ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, నవంబర్ 15(విజయక్రాంతి): ఈనెల 19న వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో సర్కారు ప్రజాపాలన విజయోత్సావాలను నిర్వహిస్తోంది.
మంగళవారం విజయోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వరంగల్‌కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 22 జిల్లాలకు చెందిన మహిళా శక్తి భవనాలకు వరంగల్ వేదికగా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో భేటీ కానున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం వరంగల్ టూర్, బహిరంగ సభ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎ స్ శాంతికుమారి, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మహిళలు ఎక్కువ దూరం నడవలేరని, వారికి ఇబ్బంది కలగకుండా వాహనాల పార్కింగ్ విషయంలో జాగ్రతలు తీసుకోవాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్నారుల విషయాల్లో ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభు త్వం సాధించిన విజయాలను వేదిక వద్ద ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సూచించారు.
పాలన విజయోత్సవాలు, వరంగల్ సభపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్ పాల్గొన్నారు.