calender_icon.png 16 November, 2024 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం

09-09-2024 03:55:02 AM

జ్ఞాపికతోపాటు రూ.లక్ష నూట పదహార్లు అందజేత

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ప్రముఖ సాహితీవేత్త, రచయిత నలిమెల భాస్కర్‌ను ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం వరించింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది పురస్కారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించగా.. ఆ కమిటీ నలిమెల భాస్కర్ పేరును ప్రతిపాదించింది. ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన సర్కారు ఆయనకు అవార్డును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా నలిమెల భాస్కర్‌కు జ్ఞాపితకతోపాటు రూ.1,01,116 నగదు బహూకరించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

స్మారక శిలలుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

నలిమెల భాస్కర్ 1956 ఏప్రిల్ 1న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సామెతలపై ఆయన విపరీతమైన సాధన చేశారు. ఈ నాలుగు భాషల సామెతలపై ఆయన ఉస్మానియాలో ఎంఫిల్ కూడా చేశారు. మలయాళ సామెతలపై పీహెచ్‌డీ చేశారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన 2011లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. నలిమెల భాస్కర్ బహుభాషా కోవిదుడు, గొప్ప అనువాదకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఉర్దూ, గుజరాతీ సహా మొత్తం 14 భారతీయ భాషలపై ఆయనకు పట్టుంది. పదుల సంఖ్యలో అనువాదాలు చేసారు.

మట్టి ముత్యాలు, సుద్దముక్క, మానవుడా, కిరణాలు, సాహితీ సుమాలు, తెలంగాణ పదకోశం, బాణం వంటి 17 సంకలనాలను రాశారు. మలయాళంలో ప్రముఖ రచయిత పుణత్తిల్ రాసిన స్మారక శిశిగల్  నలిమెల భాస్కర్ స్మారక శిలలు పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. దీనికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన రెండో రచయితగా నలిమెల గుర్తింపు పొందారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆయన్ను పలు అవార్డులు వరించాయి. బీఎన్ శాస్త్రీ పురస్కారం, అధికార భాషా సంఘం అవార్డు, గురజాడ, డాక్టర్ సినారె సహా పలు అవార్డులను నలిమెల అందుకున్నారు.