శ్రీరామోజు హరగోపాల్ :
సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం, కల్మల చెరువు గ్రామంలో పురాతన దేవాలయాలు, కోనేరు, విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఊరికి వెళ్ళే తొవ్వలో చెట్టుకింద రెండుడుగుల ఎత్తున రాతిశిల్పం ఉంది. అలంకరించబడ్డ గుర్రం మీద స్వారిచేస్తున్న వీరుడు రాచరికపు దుస్తులతో కుడిచేత ఈటెవంటి ఆయుధంతో, ఎడమచేత గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్నాడు.
తలపైన రాచరికపు ఛత్రం ఉంది. అంటే ఆ వ్యక్తి రాజో, ఆ స్థాయి వ్యక్తో అయిఉంటాడు. గుర్రం కాళ్ళ నడుమ ఒకటి, గుర్రం ముందర మరొకటి రెండు వేటకుక్కలు గుర్రం కాళ్ళ కింద ఉన్న అడివి పంది మీదకు దూకుతున్నాయి.
గ్రామంలో ఒకచోట కొన్ని విడివిగ్రహాలు పడి ఉన్నాయి. అందులో పదితలల నాగపడగలతో ఉన్న నాగదేవత శిల్పం ఇసుక రాతిలో చెక్కబడిఉంది. నల్లరాతిలో మరొక పదితలల నాగశిల్పముంది. ఒక శివలింగం, చాముండిదేవత, మట్టిలో మునిగితల కనిపిస్తున్న వీరగల్లు ఒకటి కనిపించాయి. అక్కడికి కొంచెం దూరంలో పురాతనమైన మెట్లబావి కోనేరుంది. వీటిలో కొన్ని శిల్పాలు రాష్ట్రకూటుల కాలంనాటివి.
ఊరిలో వేంకటేశ్వర దేవాలయం, శివాలయాలున్నాయి. వెంకటేశ్వర దేవాలయంలోని మూలవిగ్రహం, ద్వారపాలకుల శిల్పాలు కొత్తగా ఉన్నాయి. దేవాలయ నిర్మాణం కందూరిచోడుల శైలిలో ఉంది. ఇది ద్వికూట దేవాలయం, ప్రధాన దేవాలయంలో గర్భగుడి, అంతరాళాలు కొంచెం ఎత్తులో ఉన్నాయి. ఉపాలయం దిగువగా ఉంది. ఉపాలయంలో లక్ష్మీదేవి ప్రతిష్టించబడిఉంది.
రెండు ఆలయాలు ఒకే కప్పుకింద ఉన్నాయి. ముఖమంటపం 16 స్తంభాలతో ఉంది. దేవాలయద్వారం అర్ధమంటపంతో ఉంది. శివాలయం చిన్నదిగా, ఎత్తు తక్కువగా ఉంది. గర్భాలయంలో చతురస్రాకారపు పానవట్టంపై అడుగు ఎత్తున్న శివలింగం ఉంది. గర్భాలయం ఉత్తరాశిమీద లలాటబింబంగా రాష్ట్రకూటశైలి కీర్తిమకుటం ఉంది. దేవాలయం కడప చతురస్రకోణాల అంచులతో ఉంది. జైనాలయాల శైలి అది.
మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు నేను, వేముగంటి మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్, రాగి మురళి, మా రథసారథి చంటితో జరిపిన కిష్టాపురం చరిత్రయాత్రలో దారిలోనే ఉన్న కల్మల చెరువు గ్రామస్తుల కోరిక మేరకు ఆ ఊరి దేవాలయాలను, విగ్రహాలను దర్శించి వాటి చారిత్రక విశేషాలను గుర్తించాం.