calender_icon.png 31 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్కి.. గత చరితతో రేపటి భవితకు!

28-06-2024 12:05:00 AM

కథ: మహాభారతం ఆధారంగా నిర్మితమైనది ఈ సినిమా. గనక సినిమాలో ఆ ఇతి హాస ప్రస్తావన గురించి ముందుగా తెలుసుకుందాం. తన తండ్రిని చంపినందుకు పాండవులను అంతం చేయాలన్న క్రోధంతో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా అంతం చేయాలనుకుంటాడు ద్రోణాచార్య పుత్రుడైన అశ్వత్థామ. దానికి ఫలితంగా కలియుగాంతం వరకు మరణం లేకుండా, గాయపడిన శరీరంతో కఠినమైన జీవితం అనుభవిస్తావని శపిస్తా డు కృష్ణుడు. అశ్వత్థామ ప్రాయశ్చిత్తం కోరడంతో తాను ‘కల్కి’ అవతారం దాల్చే సమ యంలో రక్షకుడిగా ఉండే అవకాశమివ్వగా.. దానికోసం అశ్వత్థామ ఎదురుచూస్తుంటాడు.

సినిమాలో ప్రస్తుత కాలానికొస్తే.. జీవరాశి ఉనికి aకరువయ్యే పరిస్థితిలో భూమ్మీ ద చిట్ట చివరి నగరంగా కాశీ మిగులుతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా అల్లాడే అక్కడి ప్రజలు, సకల వనరులతో విరాజిల్లుతున్న కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని ఆశిస్తుంటారు. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడరు. అలాంటి వారిలో ఒకడే భైరవ (ప్రభాస్). మరోవైపు కాంప్లెక్స్ పాలకుడైన సుప్రీమ్ యాస్కిన్, ఒక సీరమ్ కోసం కొంతమంది ఎంపిక చేసిన మహిళలపై పరిశోధన సాగిస్తుంటాడు. వారిలో ఒకరు సుమతి (దీపిక పదుకుణె). సమస్త వనరులని తన అధీనంలో ఉంచుకుని, వ్యతిరేకించిన వారిని హతమార్చే సుప్రీమ్ యాస్కిన్ను అంతమొందించాలన్న సంకల్పంతో కాంప్లెక్స్ వ్యవహా రాలపై నిఘా పెట్టి ఉన్న శంబాలా ప్రాంత వాసులు, జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు తమ ప్రాంతంలో ‘కల్కి’ ఆవిర్బావి స్తాడని నమ్ముతుంటారు.

ఈ పరిస్థితులలో సుప్రీమ్ యాస్కిన్‌కు కావావలసిన సీరమ్ ఎక్కడ ఉంది? అది అతనికి అందిందా లేదా? కాంప్లెక్స్లో బతకాలనుకున్న భైరవ ఆ ప్రయత్నంలో ఎలాంటి అనుభవాలను చూశాడు? అశ్వత్థామ బాధ్య త పూర్తయిందా..? శంబాలా ప్రజల నిరీక్షణ ఫలించిందా..? వంటి ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే..!

విశ్లేషణ

ఈ సినిమా.. కాల గమనంలో చరిత్రలో దాగివున్న శాస్త్రీయతకు, స్వార్థం నిండిన సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య పరిణామాలని మహాభారతం వేదికగా మానవీయ కోణంలో చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు. కాలంలో వెనక్కి వెళ్లి.. అశ్వత్థామ పాత్రతో సినిమా ఆరంభించిన దర్శకుడు, అక్కడి నుంచి కలియుగాంత సమయంలోని కాశీ ప్రజల జీవన స్థితిగతులను చూపించారు. దానికి కాశీతో ముడిపడి ఉన్న కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని, అక్కడి ప్రయోగాల్ని చూపించే క్రమంలో వచ్చే సన్నివేశాలు కథలోని వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న ఘటనలు, అక్కడి పాత్రలు, వారి స్వభావాలను పరిచయం చేస్తాయి. ఆ కోవలోనే ప్రధాన పాత్రలైన అశ్వత్థామ, భైరవ, యాస్కిన్, సుమతి తెరమీదికి వస్తాయి. తను ఎదురుచూసిన తరుణం వచ్చిందని అశ్వత్థామ పసిగట్టడం, కావాల్సిన సీరమ్ ఎవరి వద్ద ఉందని యాస్కిన్ తెలుసుకోవడంతో పాటు భైరవ తన జీవితంలో రానున్న మార్పులను గుర్తించడంతో ప్రథమార్ధం పూర్తవుతుంది.

ఇప్పటివరకు ప్రభాస్ చేసిన యాక్షన్ సినిమాలు, చూసిన ఎలివేషన్లకు అలవాటు పడిన వెళ్లిన ప్రేక్షకులకు ‘అసలు ఇది ప్రభాస్ సినిమాయేనా’ అనిపిస్తుంది. ఎలాంటి భావోద్వేగాలను ప్రేక్షకుడు అనుభూతి చెందనట్టు ఉంటుంది. దాదాపు జీవితాలు అంతం అనుకుంటున్న పరిస్థితుల్లో సాహసవంతులైన వాళ్లు కొద్దిమంది కాంప్లెక్స్‌లో ఎలా ఎంటరవుదామా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి జీవితాల్లో పోరాటాలు తప్ప ఏముంటాయన్నది ప్రేక్షకులు గ్రహించాలి. మిగిలిన ప్రజానీకంలో చాలా వరకు నైరా శ్యం మినహా ఇంకేం ఉండదు. వారి బాధల్ని తెరమీద ఏకరువు పెట్టినట్టు చూపిస్తే థియేటర్లు కన్నీటి పర్యంతం అవుతాయి. మొదటి షో తర్వాత మొత్తంగా ఖాళీ అయిపోయే ప్రమాదమూ ఉంది.

అందుకే ప్రేక్షకులు సెకెండాఫ్ వరకు కూర్చోడానికి కావాల్సిన ‘యూనిట్ల’ కోసం కాశీ ప్రజల కన్నీటి గాథల్ని సైతం వ్యంగ్యాస్త్రాలుగా మార్చేశారు దర్శకుడు నాగ్ అశ్వి న్. మృణాల్ ఠాకూర్, రామ్‌గోపాల్ వర్మ వంటి సర్ప్రుజ్ కాస్టింగ్ ఈ క్రమంలో దర్శకుడికి కొంతసాయం చేసిందనే చెప్పాలి. ఒకరు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నపుడు అది అప్పటివరకు గడిపిన జీవితంలా అనిపించదు. కాలంతో పాటు నడుస్తూ అవగా హన తెచ్చుకుని అర్థం చేసుకుంటే అలవాటు పడుతుంది. మూడు విభిన్న ప్రపంచాల్లో జరిగే ఈ సినిమా కోసం ఎన్నిటినో ప్రత్యేకించి రూపొందించారు. వాటి ప్రాముఖ్య తను గుర్తించగలగితే అసహనానికి గురయ్యే అవకాశం ఉండదు.  

ద్వితీయార్ధానికి వస్తే.. ట్రైలర్లో దీపికకు ప్రభాస్ ‘హాయ్’ చెప్పే సీన్ అందరికీ గుర్తుం డే ఉంటుంది. అది దీపికకే కాదు మాకు కూడా అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తారు. ఎందుకంటే.. వారంతా చూడాలను కుంటున్నట్టు ఆయన కనపడేది అక్కడి నుంచే. ఎలాగైనా కాంప్లెక్స్‌కు చేరడం కోసం భైరవ చేసే సాహసాలు.. తన బాధ్యత నెరవేర్చే క్రమంలో అశ్వత్థామ పరాక్రమం.. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులు అటెన్షన్‌ల్లోకి వచ్చేస్తా రు. కథలో వేగం పెంచే ఈ సన్నివేశాలు ‘కల్కి’కి కాపు కాస్తాయనడంలో ఎలాంటి సందే హం లేదు. అటుపై కథ శంబాలాకు చేరుకుంటుంది.

వారితోపాటు ఈ ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషిస్తున్న యాస్కిన్ అనుచరగణం కూడా తమ వద్ద గల అధునాతన సాంకేతిక అస్త్రాలతో శంబాలాపై దాడి చేస్తారు. ఓ వైపు అశ్వత్థామ, భైరవ.. మరోవైపు యాస్కిన్ బృందంతో శంబాలా వాసులు తలపడటం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. సరిగ్గా అప్పుడే.. సినిమా లో దాదాపు ఎవ్వరూ ఊహించని రీతిలో ఓ పాత్ర ఆగమనం ఉంటుంది. ఈ ఎంట్రీతోనే సినిమా తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. ఇంతకుమించి సినిమా గురించి ఏం చెప్పినా కథ లీకై సర్ప్రుజ్ ఎలిమెంట్స్ అన్నీ బయటికొచ్చేస్తాయి.

నటీనటులు: ముందుగా అమితాబ్ బచ్చన్ గురించి చెప్పుకుంటే.. సినిమాకి ఎంతో ప్రధానమైన, సినిమాలో చాలా బలమైన పాత్ర ఇది. అశ్వత్థామగా ఆయన ఆహార్యం, 81 ఏళ్ల వయసులోనూ అమితాబ్ చేసిన పోరాటాలు గుర్తుండిపోతాయి. యువకుడిగా ఆయన కనపడినతీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విషయంలో దర్శకుడితో పాటు సంబంధిత సాంకేతిక నిపుణులు అభినందనీయులు. మరో అగ్రనటుడైన కమల్ హాసన్ ఈ చిత్రం కోసం యాస్కిన్‌గా అవతారం దాల్చారు. కనపడింది రెండు సన్నివేశాల్లో అయినా ఆ పాత్ర ప్రభావం కొనసాగింపు చిత్రాలలో మళ్లీ ఎప్పుడు ఆయన్ని చూస్తామా అని ఎదురుచేసేలా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర భిన్నమైన కోణాల్లో సాగుతుంది.

అంతే బాగా వాటికి తగ్గ భావోద్వేగాలను ఆయన పలికించారు. చాలా కాలం తర్వాత తెలుగులో ప్రభాస్ కామెడీ టైమింగ్ కనబరిచిన సినిమా ఇదే. అయితే ఆయన ఉగ్ర రూపానికే అలవాటు పడినవారు వీటిని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారన్నది ప్రశ్నార్థకం. కథకి కీలకమైనది దీపిక నటించిన సుమతి పాత్ర. అయితే నటిగా ఆమె ఎలాం టి ముద్ర వేసే అవకాశం లేదు. మరియం పాత్రలో శోభన తన అభినయంతో ఆకట్టుకున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందంలు కథలో కనపడుతున్నా విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ తరహాలో అతిథి పాత్రల్లానే అనిపిస్తాయి.

సాంకేతికత: ఈ సినిమా కోసం ఎన్నిటినో కొత్తగా రూపొదించారు. బాగా ప్రాచు ర్యం పొందిన బుజ్జితో పాటు మిగతా వాహనాలు, ఇతర సాంకేతిక అస్త్రాలను తయారు చేయడం ఒకెత్తయితే శంబాలా, కాశీ, కాంప్లె క్స్‌లను నిర్మించడం మరో ఎత్తు. వీటి మూ లంగానే ప్రేక్షకులు ఆయా ప్రపంచాలలోకి వెళ్లగలిగేది. వీటికి గాను ఇంత బడ్జెట్ కేటాయించినందుకు నిర్మాతలను మెచ్చుకొని తీరాల్సిందే. నేపథ్య సంగీతం సన్నివేశాలకు దన్నుఇచ్చింది. ‘గూస్బంప్స్’ వచ్చేలా లేపిం దీ లేదు. నిస్తేజంగానూ అనిపించదు. 

మన సినిమాలు గ్రాండ్గా ఉంటే కథ పలుచబడుతుంటుంది. కథ బలంగా ఉంటే కొన్ని సార్లు దానికి కావాల్సిన సరంజామా సరిపోదు. ఈ రెండు సమపాళ్లలో ఉండటం అరుదైన విషయం. ‘కల్కి’ ఆ కోవలోనిదే. భారతీయ సంస్కృతిలో పంచమవేదంగా భావించే మహాభారత గాథను భవిష్యత్ కాలానికి ముడిపెట్టి ఈ సినిమా కథని రూపొందించారు నాగ్ అశ్విన్. కథలు లేవు అని అనుకునే చిత్ర రూపకర్తలకు ఇలాంటి చరిత్ర, ఇతిహాసాల రూపంలో బోలెడన్ని ఉన్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం. సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కావాల్సి న కథ, మేటి ప్రతిభ, నిర్మాణ సామర్థ్యం అన్ని ఈ సినిమాకి సమకూరాయి. అయితే ఆలోచనని ఆవిష్కరించే క్రమంలో దర్శకుడికి, దానిని చూసే కోణంలో ప్రేక్షకులకి మధ్య భేదాలు ప్రథమార్ధం వరకు కొంత ఇబ్బంది పెట్టేవిగా ఉండవచ్చు. అయితే ద్వితీయార్ధాన్ని వారికి తెలిసిన బాటలోనే నడిపిం చడం, అవతార పురుషుడి ఆవిర్భావానికి.. అతడి వైభవానికి.. సరికొత్త పాత్ర ఆగమనం వంటివి ‘కల్కి’ కొనసాగింపులో ‘రేపటి కోసం’ చూసేలా చేశాయన్నది నిస్సందేహం.

సినిమా రివ్యూ


కల్కి 2898 ఏడీ

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, మాళవిక నాయర్, పశుపతి తదితరులు

ఛాయాగ్రహణం: జోర్జ్ స్టోజిలిజ్కోవిక్

సంగీతం: సంతోష్ నారాయణన్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు

నిర్మాత: సి.అశ్వినిదత్

దర్శకత్వం: నాగ్ అశ్విన్

విడుదల: 27 జూన్ 2024