ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భారతీయ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. దీనికి సీక్వెల్ ఉన్నట్టు కూడా చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్‌తో పాటు తన అల్లుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “కల్కి 2’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. రెండో పార్ట్‌లో ముఖ్యంగా ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు కీలకంగా ఉంటాయి.
అలాగే అమితాబ్ బచ్చన్ పాత్రకు సైతం ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూడు పాత్రలే సినిమాకు కీలకం. వీళ్లతో పాటు దీపికా పడుకొణె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇక కొత్త వాళ్లు కథకు అవసరమైతే తప్ప ఉండే అవకాశం లేదు. నాగ్ అశ్విన్ మంచి దర్శకుడు. ‘మహానటి’ ‘కల్కి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. నాగ్ అశ్విన్‌కు జీవితంలో ఓటమనేదే ఉండదని నా విశ్వాసం. అతని ఆలోచనా విధా నం చాలా గొప్పగా ఉంటుంది” అని అశ్వనీదత్ వెల్లడించారు.