calender_icon.png 2 November, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను చేసిన వాటిలో ఉత్తమమైనది కల్కి

25-06-2024 12:20:41 AM

వందల కొద్ది సినిమాల్లో అనేకానేక పాత్రల్లో నటించి మెప్పించి ఘనత విఖ్యాత నటుడు కమల్‌హాసన్‌ది. అలాంటి ఆయన రెండు సినిమాల అనుభవం గల నాగ్ అశ్విన్‌తో సినిమా చేసేందుకు ఎలా సమ్మతించారు? కల్కి సినిమాలో కమల్ భాగమైనప్పటి నుండి ఎంతోమంది సినీ ప్రియుల మెదళ్లను తొలిచేస్తున్న  ప్రశ్న ఇది? దీనిపై కమల్  ఏమన్నారన్న విషయం ఇప్పుడు తెలియవచ్చింది. వైజయంతీ మూవీస్ సంస్థలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల కళ్ల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న, ప్రియాంకలతో పాటు చిత్రంలోని అగ్ర నటులైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకొణె కలిసి సినిమా గురించిన విషయాలను ఓ ప్రత్యేక సమావేశంలో పంచుకున్నారు.

ఆ విశేషాలు.. కమల్‌హాసన్ మాట్లాడుతూ “దర్శకుడు నాగ్ అశ్విన్ స్టోరీబోర్డ్‌తో సహా తన వద్దకు వచ్చి కథ వివరించగా, ఇలాంటి బొమ్మలు చాలామంది తీసుకొ స్తారు. కానీ మీరు దీన్ని ఎలా తెర పై చూపిస్తారు” అని ప్రశ్నించినట్టు తెలిపారు. కొనసాగిస్తూ “వెంటనే నాగి అప్పటికే అమితాబ్‌తో చిత్రీకరించిన పలు సన్నివేశాలను చూపించారని, అవి చూశాక.. మరో మాట లేకుండా తన పాత్ర ఎలా ఉండాలన్న ఆలోచనల్లోకి వెళ్ళిపోయాను” అని చెప్పుకొచ్చారు. వెంటనే అందుకున్న నిర్మాతలు కమల్ కోసం తాము సంవత్సర కాలంగా వేచి చూశమని చెప్పగా, దీనిపై ప్రభాస్ స్పందిస్తూ “కమల్ ఈ సినిమా ఎందుకు చేస్తా రు.. ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దంటూ ఆ సమయంలో సలహా ఇచ్చానని” నవ్వుతూ చెప్పారు.

అటు అమితాబ్ సైతం ‘కల్కి’లో తన చేరిక గురించి చెబుతూ “నాగి వచ్చి కథ చెప్పినపుడే సినిమాలో ప్రభాస్ ఎలా కనపడతాడు? తన పాత్ర ఎలా ఉండబోతుంది? వంటి విషయాలను చాలా క్షుణ్ణంగా వివరిం చాడు. అంత విజన్ ఆయనలో పెట్టుకుని చిత్రీకరణ సమయంలో ఒక్క సందర్భంలో కూడా అసహనం వ్యక్తం చేసినట్టూ నేనెక్కడా చూడలేదు. అది సినిమా సెట్స్ మీద ఎంతో అరుదు. సినిమా కోసం మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేదని.. అయితే ఈ సినిమా విష యంలో అది ఇబ్బందిగా అనిపించలేదు” అన్న ఆయన, “మునుపెన్నడూ చూడని, ఊహించని ఇలాం టి ఓ సినిమా ని ఇద్దరు మహిళలు ఇంత భారీ స్థాయిలో నిర్మించడం గర్వించదగ్గ విషయం” అంటూ స్వప్న, ప్రియాంకలను కొనియాడారు.

ఈ సినిమాలో తన అభిమాన నటులైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి నటించిన ప్రభాస్, “దర్శకుడు నాగ్ అశ్విన్ తన తొలి సినిమానే నాతో చేయాలనుకున్నారని, గతంలో నేను చేసిన పాత్రలతో పోలిస్తే ‘కల్కి’లోని భైరవ పాత్ర ఉత్తమమైనది అన్నా రు. ఈ పాత్రలో గ్రే షేడ్స్ ఉంటూనే సూపర్ హీరోలా కనపడతానన్న ఆయన, ఇందులో చమత్కారం కూడా ఉంటుందని” తన పాత్ర గురించిన వివరాలను తెలిపారు. తెలుగు సినిమా చేయడం కష్టం అనిపించిందా అన్న ప్రభాస్ ప్రశ్నకు కథానాయిక దీపిక పదుకొణె బదులిస్తూ “ఈ సినిమాలోని ప్రపంచం అందరికీ కొత్త దే. సరిహద్దులు చెరిపివేసే ఈ కథతో ఏ భాషలో అయి నా నటించవచ్చు. కళ్ళతో కూడా పలికించే భావోద్వేగాలకు భాష అనేది అడ్డంకి కాదు” అని చెప్పుకొచ్చారు.  

“‘మహానటి’ సినిమా తర్వాత రెండు ఆలోచనలున్నాయని చెప్పిన నాగ్ అశ్విన్, రెండవది చేసేందుకు ఇదే తగిన సమయమంటూ ‘కల్కి’ కథ చెప్పారు. ఆ అనుభూతి నుండి బయటకు రావడానికే మాకు రెండు రోజులు పట్టింది. ఆ సమయంలో ఇలాంటి ఓ సినియా తీయడానికి ఏమేం అవసరమవుతాయో మాకు తెలీదు. ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆయన విజన్ కొంచెం కొంచెంగా అర్థమయ్యేది. ఓ దశలో ఆ విజన్‌కి మేము సరిపోతామా అనిపించేది. ఈ సినిమా కోసం ప్రతిదానిని కొత్తగా రూపొందించాలి. దానికోసం 5 నెలల సమయం పట్టింది. ఇప్పు డు దేశానికి ఇలాంటి సినిమా అందివ్వాలి అన్న నాగ్ అశ్విన్ సంకల్పంతో ‘కల్కి’ ఆవిర్భావం జరిగిందని” నిర్మాతలు తెలిపారు.

మథురలో థీమ్ ఆఫ్ కల్కి

మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ‘థీమ్ ఆఫ్ కల్కి’ అనే గీతాన్ని మథురలో ఆవిష్కరించింది చిత్ర బృందం. దీనికి గాను శాస్త్రీయ నర్తకి, నటి శోభన నాట్య బృందంతో కలిసి అక్కడ ప్రదర్శన ఇవ్వడం విశేషం. ఈ సినిమా మహాభారతం ఆధారంగా నిర్మితమైనందున, కృష్ణుడి జన్మస్థలమైన మథురలో ఈ పాటని విడుదల చేయాలను కున్న ‘కల్కి’ టీమ్ త్వరలో పూర్తి గీతాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు.