calender_icon.png 25 October, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్కి... వెయ్యి కోట్ల క్లబ్‌లోకి

14-07-2024 01:50:57 AM

ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి2898ఏడీ’ మరో మైలురాయిని దాటింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు వసూలు చేసినట్టు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ  సంస్థకు చెందిన ఎక్స్ ఖాతా లో ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో ఉన్న పోస్టర్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. అయితే, గతంలో ‘బాహుబలి 10 రోజుల వ్యవధిలో ఈ మైలురాయిని దాటగా.. ‘కల్కి’ టీమ్‌కు పక్షం రోజుల సమయం పట్టిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెప్తున్నాయి. గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసింది.

వెయ్యి కోట్ల గ్లోబల్ క్లబ్‌లో గతంలో ఆరు భారతీయ సినిమాలు చేరగా, ‘కల్కి’ ఏడో చిత్రంగా నిలిచింది. 2016లో ‘దంగల్’ సినిమా రూ.2024 కోట్లు సాధించగా, 2017లో ‘బాహుబలి రూ.1810 కోట్లు వసూలు చేసింది. 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1387 కోట్లు వసూళ్లు రాబట్టగా, అదే ఏడాది విడుదలైన ‘కేజీఎఫ్4 సినిమా 1250 కోట్ల రూపాయలను మేకర్స్ గల్లా పెట్టెలోకి చేర్చింది. ఇక గత ఏడాది ‘జవాన్’కు రూ.1148 కోట్లు, ‘పఠాన్’కు రూ.1050 కోట్లు దక్కాయి. అటు నార్త్ అమెరికాలోనూ 17 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది ‘కల్కి’ చిత్రం. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, కెనడా వంటి ఇంకా కొన్ని ఇతర దేశాల్లో నాన్ ‘బీబీ2’ హిట్‌గా ‘కల్కి’ నిలిచింది. దక్షిణాది కథానాయకుల్లో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రెండుసార్లు రాబట్టిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డుల్లో నిలిచారు.