calender_icon.png 22 September, 2024 | 3:05 PM

కలియుగ దైవం.. వింత ఆచారం

22-09-2024 12:29:13 AM

అప్పన్నపేట వెంకటేశ్వరుడికి నైవేద్యంగా మాంసాహారం

  1. కోళ్లు, యాటలను బలి ఇస్తున్న భక్తులు
  2. ఏకశిలపైనే ముగ్గురు మూర్తులు
  3. కల్యాణాలకు ప్రసిద్ధ దేవాలయం
  4. టెంపుల్‌పై ప్రభుత్వం నీలినీడలు
  5. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
  6. స్వామి పేరిట మూడెకరాల భూమి
  7. దేవాలయంలోనే మాంసాహారం ఆరగింపు

(నట్టె కోటేశ్వర్‌రావు) :

సూర్యాపేట, సెప్టెంబర్ 21: కలియుగదైవం శ్రీనివాసుడిని కొలువని వారుండరు. తిరుమలతో మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుడి ఆలయాల్లో స్వామి వారికి లడ్డూలు, పులిహోర, చక్కెర పొంగలి వంటి సాత్విక పదార్థాలనే నైవేథ్యంగా సమర్పిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో కొలువుదీరిన వెంకన్న ఆలయంలో ఓ వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది.

దేవాలయం ముందు గల ఓ బండపై కోళ్లు, యాటలను బలి ఇచ్చిన తర్వాత స్వామి వారిని దర్శించుకుని నైవేథ్యాలను సమర్పిస్తుంటారు. ఎక్కడా కనిపించని ఈ సాంప్రదాయం అనేక తరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నది. అప్పన్నపేటకు గ్రామానికి చివర పచ్చని పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వేంకటేశ్వరాలయానికి శతాబ్ధాల చరిత ఉంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఇక్కడున్న ఆధారాల ద్వారా తెలుస్తోంది.  స్వామి వారిని దర్శించుకుంటే మనస్సులోని కోరికలు  నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తుంటారు.

అలా మొదలయింది ఆచారం.. 

శతాబ్దాల క్రితం పొనుగోడు గ్రామానికి చెందిన ఓ మేకల కాపరి పశువుల మేత కోసం మందతో అప్పన్నపేట సమీపానికి వచ్చాడు. మేకల మేత కోసం ఓ తుమ్మచెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. మరోసారి చెట్టు ఎక్కగా మళ్లీ పడిపోయాడు. మూడోసారి ఎక్కగా ఎవరో కిందకు తోసినట్లుగా పడిపోయాడు. దీంతో కాపరి తలకు తీవ్రగాయాలు కాగా రక్తంతో నేలంతా తడిసిపోయింది. విషయం తెలుసుకున్న కాపరి కుటుంబసభ్యులు వచ్చి చూడగా ఆ తుమ్మచెట్టు మొదలు దగ్గర ఉన్న పుట్టలో స్వామి వారి కిరీటం కనిపించింది.

అదే సమయంలో ఈ ప్రాంతంలో పాలనావ్యవహారా లు చూసుకుంటున్న అప్పన్నకు స్వామివారు కలలో కనిపించి ‘నేను పుట్టలో కొలువుదీరి ఉన్నాను. రక్తంతో తడిపితే బయటకు వచ్చి ఈ ప్రాంత భక్తులకు ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పగా’ ఆయన ఇక్కడ యాటలు కోయించి రక్తంతో తడపడంతో స్వామి వారి విగ్రహం పూర్తిగా బయట పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఆ విగ్రహాలతో కాకతీయ ప్రభువుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు.

అలాగే చెట్టు పైనుండి పడిన వ్యక్తి త్వరగా కోలుకుని మేకల మంద పెరిగితే ఒక మేకను స్వామికి అర్పిస్తామని ఆయన కుటుంబ సభ్యులు మొక్కుకుంటే వేగంగా కోలుకోవడం, అంతే శీఘ్రంగా మంద పెరగడంతో మొక్కు చెల్లించుకున్నారు. తదుపరి గ్రామంలోని ఓ వ్యక్తికి స్వామివారు పూని తనకు గొర్రెపోతులు, మేకలు, కోళ్లు వంటివి సమర్పించాలని చెప్పడంతో నాటి నుండి ఈ ఆలయంలో ఈ ఆచారం మొదలయినట్లు తెలుస్తుంది. 

ఆ ఊర్లకు వారి పేర్లే ..

15 శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన అప్పన్న, జక్కన్నలు ఈ ప్రాంతపాలనా వ్యవహారాలు చూసుకునేవారట. లోటు లేకుండా చూసుకుంటుండడంతో అప్పన్న పేరు మీద ఈ గ్రామానికి అప్పన్నపేట అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే అతని సోదరుడు జక్కన్న ఈ ప్రాంతంలోని పంటల దిగుబడులు అమ్ముకునేందుకు విజయవాడకు వెళ్లి ఆ ప్రాంతంలోనే స్థిరపడగా కాలక్రమంలో ఆయన నివశిస్తున్న ఊరిపేరు జగ్గయ్యపేటగా మారిందని స్థానికులు చెప్తుంటారు. 

ఎన్నో విశిష్టతలు.. 

 ఏటా జేష్ఠమాసంలో స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహిస్తారు. గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా స్వామి వారి మొక్కులు చెల్లించుకోవాల్సిందే. రైతులు కూడా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. దిగుబడులను మొదటగా స్వామికి సమర్పిస్తుంటారు. దేవాలయ ప్రాగణంలో ఉన్న చేతిపంపు నీటినే అందరూ తాగుతారు. మినరల్ వాటర్ జోలికే వెళ్లరు. వెంకన్న సన్నిధిలోని చేతిపంపు నీటినే శుభకార్యాలకూ వినియోగిస్తారు.

ఏకశిలాయుత దైవరూపాలు..

సాధారణంగా ఏ ఆలయంలోనైనా వేంకటేశ్వరస్వామి వారితో పాటు అమ్మవారి విగ్రహాలను వేర్వేరు శిలలపై చెక్కుతారు. కానీ ఈ దేవాలయంలో వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవీ అమ్మవార్ల రూపాలు ఏకశిలపైనే కొలువుదీరి ఉండడం అత్యంత విశేషం. ఏకశిలపై ముగ్గురు మూర్తులు ఉండడం.. కాకతీయుల కాలంనాటి శిల్పకళకు నిదర్శనం అని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో అప్పన్నపేట గ్రామం మధ్యలోని ఈ ఆలయం ఉండేది. తరువాత కాలంలో కలరా సోకి గ్రామవాసులు చాలా మంది చనిపోయారు. గత్యతరం లేక గ్రామస్తులంతా ఊరు విడిచి పొలిమేరలో ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో కొంతకాలం దేవాలయానికి ఆదరణ కరువై అభివృద్ధికి నోచుకోలేదు.

పిలిస్తే పలికే దేవుడు కావడంతో కొన్నాళ్లకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో ముఖమండపం, ప్రహారి, నవగ్రహ మండప నిర్మాణంతో పాటు నాగేంద్రున్ని ప్రతిష్టించారు. 2010లో రాతి ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిపించారు. నైవేథ్యాలకు ఇబ్బందులు రాకుండా గతంలోనే స్వామి వారి పేరుపై మూడెకరాల వ్యవసాయ భూమిని కొన్నారు. కౌలు ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయ నిర్వాహణ కొనసాగిస్తున్నారు.

ఈ దేవాలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి శనివారం ఎక్కడెక్కడి నుండో భక్తులు అప్పన్నపేట శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుని స్వామికి మేకలు, కోళ్లు, గొర్రెపోతులతో మొక్కులు తీర్చుకుని ఆలయ ఆవరణలోనే ఆరగిస్తారు.  

కల్యాణాలకు ప్రసిద్ధి..

ఈ దేవాలయం చాలా చారిత్రాత్మకమైనది. భక్తుల కోరికలు తీర్చే దేవుడు కావడంతో కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు శ్రీనివాసుడు. భక్తులు సైతం ఎక్కువ సంఖ్యలో వచ్చి దైవదర్శనాలు చేసుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఇక్కడ కల్యా ణం జరిగిన దంపతులకు ఏ లోటు ఉండదన్న నమ్మకంతో ఈ దేవాలయంలో వివాహాలు ఎక్కువగా జరిపిస్తుంటారు. అయితే దేవాలయంలో కల్యాణ మండపం లేకపోవడంతో కల్యాణాలు జరిపించాలంటే ఇబ్బందులు పడా ల్సి వస్తుంది. ఇప్పటికే దాతలు  దేవా లయాన్ని చాలా అభివృద్ధి చేశారు. అయితే మరింత మంది దాతలు ముందుకు వచ్చి కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు  కోరుతున్నారు. ప్రభుత్వం  దేవాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. 

 అళహరి నర్సింహాచార్యులు, 

దేవాలయ అర్చకుడు