- ఈ దఫా విచారణకు గత ప్రభుత్వపెద్దలు!
- విచారణ పూర్తిచేసి సర్కార్‌కు నివేదిక ఇచ్చే దిశగా కసరత్తు
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల కుంభకోణం అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. తర్వాత ప్రాజెక్టుపై విచార ణకు ఆదేశించింది. ఇందుకు పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ గడువును రెండున్నర నెలలుగా నిర్ణయించినా.. 9 నెలలు దాటినా ఇంకా విచారణ తుది దశకు రాలేదు.
గతేడాది మార్చి 14న ప్రారంభమైన పీసీ ఘోష్ కమిషన్ మొదట రెండున్ననెలల వరకు గడువుగా నిర్ణయించినా... 4సార్లు ప్రభుత్వం గడువు పెంచుతూ వచ్చిం ది. అయితే ఈ మా రు విచారణను వ చ్చేనెలాఖరు లోపు పూర్తి చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నేటి నుంచి తిరిగి ప్రారంభం అవుతోంది.
క్రిస్మస్, సంక్రాంతి సెలవుల కారణంగా వాయిదా పడిన కమిషన్ విచారణ నేటి నుంచి కొనసాగనుంది. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని, ఇంకా విచారించాల్సి ఉన్నతాధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, ప్రాజెక్టు పనులు నిర్వహించిన కంపెనీల ప్రతినిధులను విచారించనున్నట్లు సమాచారం.
గతంలోనే విచారణకు హాజరుకావాల్సి ఉన్నా విదేశీ పర్యటన వల్ల రాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు విచారణ ఈ దఫా ఉండనుంది. ఇక గత ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి సాగునీటి, ఆర్థిక శాఖలు చూసిన హరీశ్‌రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను సైతం విచారణకు పిలిపిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నా యి.
తప్పనిసరిగా వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరో వైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా తుది నివేదిక రూపకల్పనపైనా కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు విచారణ పూర్తి కాని వారిని విచారిచడంతో పాటు గత ప్రభుత్వ పెద్దలను, కంపెనీల ప్రతినిధులను విచారించి ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి సర్కారుకు అప్పగించేందుకు కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కాగ్, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులను పరిగణనలోకి చేసుకొ ని 3 బ్యారేజీలకు సంబంధించిన లోపాలు, తప్పులపై విచారణ కొనసాగిస్తోంది.
ఆర్థిక అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, ఇతర అంశాలపై విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి కానందున ఇప్పటికే కమిషన్ పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. కాగా ఈసారి మరోమారు కమిషన్ గడువును పొడిగించే అవసరం ఉండబోదని సంబంధి త వర్గాలు అంటున్నాయి. ఆదివారం కోల్‌కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్.. నేటి నుంచి విచారణ ప్రారంభిస్తారు.అయితే మంగళవారం నుంచి బహి రంగ విచారణ ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు విచారణకు హాజరైన ప్రముఖులు...
టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం, సాగునీటి రంగ నిపుణుడు వెదిరే శ్రీరామ్, మాజీ సీఎస్‌లు సోమేశ్ కుమార్, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారులు వికాస్‌రాజ్, స్మితా సబర్వాల్ సహా సాగునీటి పారుదల శాఖ అధికారులు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, సీడబ్ల్యూసీ తదితర శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డ్ అధికారులు విచారణకు హాజరయ్యారు.