calender_icon.png 23 September, 2024 | 2:24 AM

కాళేశ్వరం ప్రాజెక్టు వృథా కాదు

23-09-2024 01:00:53 AM

నీటిని తరలించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించింది

అవగాహనారాహిత్యం బయటపెట్టుకున్న పాలకులు 

మాజీ మంత్రి హరీశ్ ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. సమైక్య రాష్ర్టంలోని కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందనే విషయం మరిచిపోతురన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేరుకే బ్యారేజీ పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదని, పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాల తరలింపు జరగలేదని గుర్తుచేశారు.

స్వరాష్ట్రంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పునరావాస కాలనీలు నిర్మించి, ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించిందని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లిని ఒక కీల క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చి న తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభమైందని వెల్లడించారు. అంబేద్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయని మంత్రి పొన్నం ఒప్పుకొన్నందుకు సంతోషకరమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నాయకులు అదే కాళేశ్వ రం వ్యవస్థను బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు వృథా అన్న సిద్ధాంతాన్ని వారే అబద్ధమని నిరూపిస్తున్నారని చెప్పారు. నిజాలు చెప్తే.. పొన్నం భుజాలు తడుముకొని కాళేశ్వరం నీళ్ళు కావు ఎల్లంపల్లి నీళ్ళు అని నీళ్ళు నమిలాడని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ఉపయోగం ఏమిటో రైతాంగానికి తెలుసన్నారు.